Ashish Mishra News: లఖింపుర్ ఖేరీ హింస కేసులో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్ర బెయిల్‌ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వారంలోపు లొంగిపోవాలని మిశ్రను ఆదేశించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. బాధితుల పక్షాన ఉన్న అంశాలను హైకోర్టు పట్టించుకోలేదని తెలిపింది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమించిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మిశ్రా బెయిల్ విషయంపై సుప్రీంకోర్టులో ఈనెల 4న కూడా విచారణ జరిగింది. ఆశిష్ మిశ్రకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు చెప్పిన కారణాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్) సూచనలను యూపీ ప్రభుత్వంపై పట్టించుకోకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటిస్తూ.. విచారణలో కొన్ని కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. ముఖ్యంగా బెయిల్ మంజూరుకు పోస్టుమార్టం నివేదిక, గాయాలు తదితర అంశాలను అలహాబాద్ హైకోర్టు ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సీజేఐ ఎన్.వి.రమణ తప్పుపట్టారు.
"ఇలాంటి పిచ్చితనాన్ని అంగీకరించం. ఈ పదాన్ని వాడుతున్నందుకు క్షమించాలి. కానీ.. బెయిల్ పరిశీలనకు ఈ విషయాలు ఏ మాత్రం అంగీకారయోగ్యమైనవి కావు. అతనికి తూటా తగిలింది. కారు ఢీకొట్టింది. బండిచక్రం, స్కూటర్ ఢీకొట్టింది. ఏమిటిదంతా" అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఆశిష్ ఎవరిపైనా కాల్పులు జరపలేదని, ఇందుకు పోస్టుమార్టం నివేదికే సాక్ష్యమని బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొనడాన్ని సీజేఐ ధర్మాసనం తప్పుపట్టింది. విచారణలో తేలాల్సిన అంశాలను బెయిల్‌కు ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పేర్కొంది. "పోస్టుమార్టం తదితర నివేదికల్లోకి న్యాయమూర్తి ఎందుకు వెళ్లారు. బెయిల్‌పై విచారణకు గాయాలు తదితర అంశాల ప్రస్తావన అనవసరం" అని సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఘటనపై దాఖలైన సుదీర్ఘ అభియోగపత్రాన్ని పట్టించుకోకుండా..కేవలం పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై ఆధారపడి నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోజు వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేసి ఈరోజు వెలువరించింది.
లఖింపుర్ టికూనియా ప్రాంతంలో గతేడాది అక్టోబర్ 3న హింసాత్మక ఘటన జరిగింది. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి కారు దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సైతం వైరల్ అయింది. దీంతో ఆశిష్ మిశ్రను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చదవండి: 'త్వరలో భాజపాయేతర సీఎంల భేటీ!'