దిల్లీ- జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో కాలుష్యానికి సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఎలాంటి పొగమంచు చేరకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
వాయునాణ్యత నిర్వహణ కమిషన్ కార్యకలాపాలు శుక్రవారం (ఇవాళ) నుంచి ప్రారంభించాలని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్ఫష్టం చేసింది. వాయు కాలుష్యానికి సంబంధించిన ఇతర అభ్యర్థనలను దీపావళి సెలవుల తర్వాత విచారిస్తామని తెలిపింది.
ఛైర్మన్ నియామకం..
కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కమిషన్ శుక్రవారం నుంచి పనిచేస్తుందని న్యాయస్థానానికి విన్నవించారు. ఇందుకు సంబంధించి కమిషన్ సభ్యులను నియమించినట్లు తెలిపారు.
ఈ మేరకు ఎన్సీఆర్, దాని పరిసర ప్రాంతాల్లో వాయునాణ్యత నిర్వహణ కమిషన్కు దిల్లీ మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.కుట్టీని ఛైర్మన్గా కేంద్రం నియమించింది.
ఇదీ చూడండి: కాలుష్య నివారణ ఏకసభ్య కమిటీ రద్దు