Sanjay Singh ED Case Delhi Court : దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీని మరోసారి పొడిగించింది దిల్లీ కోర్టు. సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 27 వరకు పొడిగిస్తూ దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం వెలువరించింది. ఈ క్రమంలో న్యాయస్థానంలో ఓ అనూహ్య పరిణామం జరిగింది. విచారణ సందర్భంగా అదానీ అంశంపై సంజయ్ సింగ్ మాట్లాడారు. దీంతో ఆయన్ను అడ్డుకున్న న్యాయస్థానం.. అనవసర విషయాలపై న్యాయస్థానంలో ప్రసంగాలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది.
AAP Sanjay Singh Latest News : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో ఆయన్ను సుమారు ఏడు రోజుల పాటు ప్రశ్నించింది. కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో.. ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపరిచింది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ మాట్లాడారు. తాను గౌతమ్ అదానీపై ఫిర్యాదు చేశానని, ఆ కోణంలో మాత్రం ఈడీ దృష్టిసారించడం లేదని వ్యాఖ్యానించారు. అదానీపై ఫిర్యాదుకు సంబంధించిన ప్రశ్నలను తనను అడగడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి
'ఆ స్పీచ్‌లు ఇవ్వాలనుకుంటే..'
ఈ క్రమంలో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ జోక్యం చేసుకున్నారు. న్యాయస్థానంలో అనవసర విషయాలు ప్రస్తావించొద్దని సంజయ్ సింగ్‌కు హితవు పలికారు. 'అదానీ, ఇతరుల గురించి స్పీచ్ ఇవ్వాలనుకుంటే.. ఇక నుంచి మిమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచాలని ఆదేశిస్తాం' అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్‌ను అక్టోబరు 4న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు సంజయ్‌ను.. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీ కోరగా.. అక్టోబరు 13 వరకు కస్టడీకి అనుమతించింది. తాజాగా ఆ గడువు ముగియడంతో జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 27 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
లిక్కర్ స్కామ్ విలువ రూ.2వేల కోట్ల పైనే.. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల హస్తం