స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్ల విచారణర్హతను ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం పిటిషన్పై మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత మంజూరు చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అనేది.. కేవలం పట్టణ ఉన్నతవర్గాల దృక్పథమని అఫిడవిట్‌లో పేర్కొంది.
"గ్రామాలు, పట్టణాలు సహా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. వ్యక్తిగత చట్టాలు, వివాహ వ్యవస్థ ఆచారాలు, మతపరమైన అభిప్రాయాలు.. ఇతర చట్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్వలింగ వివాహ చట్టబద్ధతపై పార్లమెంట్‌లో చట్టం చేయాలి. కేవలం ఒక వర్గం ప్రజల కోసం చట్టం చేయలేం. స్వలింగ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధం. వాటికి చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సమతుల్యం పూర్తిగా దెబ్బతింటుంది."
-అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం
వివాహ గుర్తింపు అనేది శాసన సంబంధిత వ్యవహారమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది. 'సంబంధాల గుర్తింపు.. చట్టబద్ధ హక్కులు ఇవ్వడం కేవలం శాసనసభల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. న్యాయ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యం కాదు. రాజ్యాంగం ప్రకారం ఇది పూర్తిగా శాసన హక్కుల ద్వారా మాత్రమే నిర్ణయించాల్సిన విషయం' అని అఫిడవిట్‌లో వివరించింది కేంద్రం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్. నరసింహతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై కూడా మంగళవారం విచారణ జరపనుంది.
కేసు ఇదీ..
ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం తమ పెళ్లికి చట్టబద్ధత కల్పిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రెండు స్వలింగ జంటలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గతేడాది నవంబర్ 25న సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, ఈ కేసులో పలు ప్రాథమిక సమస్యలు తలెత్తుతున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమగ్ర విచారణ జరిగేలా.. ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఈ ఏడాది మార్చి 13న కేసును బదిలీ చేసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పే తీర్పు.. దేశవ్యాప్తంగా అనేక మందిపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల్లో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సుప్రీం విచారణ ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.