ఒడిశాలోని సంబల్పుర్ జిల్లాలో ఓ డాక్టర్ పేద ప్రజల పాలిట దైవమై నిలిస్తున్నాడు. ఒక్క రూపాయికే వైద్యం అందించడానికి క్లినిక్‌ను స్థాపించాడు. నిరాశ్రయులకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఆపన్నహస్తం అందిస్తున్నాడు.
చిన్ననాటి కల..
శంకర్ రామ్ చండాని..జిల్లాలోని బుర్లా పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచే పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిచాలనే కల ఉండేదతనికి. కానీ ఆయన పనిచేసే ఉద్యోగ స్థాయిలో ప్రైవేట్‌గా క్లినిక్ నడపడానికి అనుమతి లేదు. ఇన్నిరోజుల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందడంతో తన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. పేద ప్రజలకు ఆపన్న హస్తం అందించాలనుకున్నాడు. తన ఉద్యోగం అయిపోయిన తర్వాత ఖాళీ సమయాల్లో ఉచిత వైద్యం అందించాలనుకున్నాడు. బుర్లా పట్టణంలో కచ్చా మార్కెట్ ప్రాంతంలో అద్దె భవనంలో క్లినిక్‌ను స్థాపించాడు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వైద్యం అందిస్తున్నాడు.
నర్సింగ్ హోమ్ స్థాపించాలని నా తండ్రి నాకు చెప్పారు. కానీ దానికి చాలా డబ్బులు అవసరమవుతాయి. ఒక్క రూపాయిలో నర్సింగ్ హోమ్‌ను నిర్వహించలేము. అందుకే దీనిని స్థాపించాను. నేను పనిచేసే ఆసుపత్రికి వందల సంఖ్యలో జనం 'క్యూ' కడతారు. దివ్యాంగులు, వృద్ధులు గంటల తరబడి నిల్చుంటారు. కానీ నా క్లినిక్‌లో ఆ అవసరం లేదు. ఒక్క రూపాయితో వెంటనే సంప్రదించవచ్చు.
-శంకర్ రామ్ చండాని
ఒక్క రూపాయికే..
శంకర్ చండాని..తన క్లినిక్‌లో ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్నాడు. ఈ ఒక్క రూపాయి మాత్రం ఎందుకని అడగగా.. చికిత్స చేయించుకునేవారు సైతం అత్మన్యూనతా భావానికి లోనుకాకుండా ఉంటుందని అంటున్నాడు. రోగులు.. తాము కూడా డబ్బులు ఇచ్చే వైద్యం చేయించుకున్నామనే భావించాలని ఇలా చేశానంటున్నాడు. నిరాశ్రయులైన వ్యక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు వైద్యం అందిస్తానంటున్నాడు. బలవంతుల కోసం కాదు బలహీనుల కోసం పనిచేస్తానంటున్నాడు.
సేవాతత్పరుడు..
శంకర్ చండాని గొప్ప సేవాతత్పరుడు. గతంలోనూ తన సేవాగుణంతో అందరికీ సుపరిచితమే. కుష్ఠు వ్యాధి సోకిన రోగిని చేతులతో ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్లి ఆశ్రయం కల్పించాడు. కరోనా వైరస్ సమయంలోనూ ఏ మాత్రం భయపడకుండా వైరస్ సోకిన వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. తన ఉద్యోగ సమయం అయిపోయిన తర్వాత కూడా రోగులకు చికిత్స చేశాడు.
సతీమణి తోడై..
శంకర్ చండాని భార్య సిఖా రామ్ చండాని. ఈమె దంత వైద్య నిపుణురాలు. నిరంతరం భర్తకు తోడై నిలుస్తుంది. అతను చేసే సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. క్లినిక్ స్థాపనలో శంకర్ చండానికి అండగా నిలిచింది.
ఇదీ చదవండి: 48 అడుగుల కేక్‌తో బేకరీ 'రామ సందేశం'