సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ లఖ్‌నవూలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ట్వీట్ చేసింది. వ్యాక్సిన్ వేయించుకున్న చిత్రాన్ని కూడా జత చేసింది. ములాయం టీకా వేసుకోవడంపై అధికార భాజపా స్పందించింది. చక్కని సందేశం ఇచ్చారంటూ కొనియాడింది. అదే సమయంలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ని లక్ష్యంగా చేసుకుంది.
కరోనా వ్యాక్సిన్‌ను 'భాజపా వ్యాక్సిన్'గా ఈ ఏడాది జనవరిలో అఖిలేశ్ పేర్కొన్నారు. ములాయంకు ఇప్పుడు అదే భాజపా వ్యాక్సిన్ అందిందంటూ భాజపా యూపీ విభాగం వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. అలాగే, ములాయం నుంచి అఖిలేశ్ స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ట్వీట్ చేశారు. ఎస్పీ నేతలు, కార్యకర్తలు సైతం వ్యాక్సిన్ వేయించుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేడు ప్రధానితో ఉద్ధవ్ భేటీ