ఆమె ఓ సాధారణ గృహిణి. వయస్సు 70 ఏళ్ల పైమాటే. ముగ్గురు సంతానం. ఇంట్లో తీరికలేని పని. అయినా 20 ఏళ్లుగా రోజూ 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మూగ జీవాల ఆకలి తీరుస్తోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో ఆమె ఎందుకు ఇలా చేస్తుంది. తెలుసుకుందాం..
చుట్టూ చేరిన వానరాల ఆకలి తీరుస్తున్న ఈమే పేరు సువర్ణమ్మ. స్వస్థలం కర్ణాటకలోని నాగయాన్‌పాల్యా. గత 20 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు. సొంతూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడగండ్లకు రోజు వెళ్తారు. వచ్చే దారిలో మూగజీవాల కోసం కూరగాయలు, పళ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తారు. తీసుకొచ్చిన ఆహార పదార్థాలను అక్కడ ఉన్న వానరాలకు ప్రేమతో అందిస్తున్నారు. బుట్టతో సువర్ణమ్మ రాకను గమనించిన వెంటనే అక్కడి వానారాలు ఆమె చుట్టూ చేరి గోలపెడతాయి. కురగాయాలు తీసుకుని మెళ్లగా చెట్లు, గోడలపైకి ఎక్కి ఆరగిస్తాయి. కోతి పిల్లలు మాత్రం సువర్ణమ్మ భుజంపై కూర్చొని ఆమె ఇచ్చే పండ్లను కీచులాడుతూ తింటాయి.
ఆమె బుట్టలో కీర దోస, అరటి, టమాటాలు, బిస్కెట్లు, ఇతర పండ్లు ఉంటాయి. వీటిని అక్కడ ఉన్న కోతులు, శునకాలకు సువర్ణమ్మ అందిస్తోంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప.. మిగిలిన అన్ని రోజుల్లో క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తానని సువర్ణమ్మ చెబుతున్నారు. తాను రాలేనప్పుడు తన భర్త సుబ్బన్న ఇక్కడికి వచ్చి మూగజీవాల ఆకలి తీరుస్తారని చెప్పారు.
మంసాహారం ఇచ్చే జంతువులనే ప్రజలు ఎక్కువగా మచ్చిక చేసుకుంటారని వానరాలను ఎవరు పట్టించుకోరని సువర్ణమ్మ చెప్పారు. కరోనా కాలంలో మూగజీవాలు ఆకలితో అలమటించి చనిపోతున్నాయని వాపోయారు. అందుకే రోజు వాటి ఆకలి తీర్చేందుకు ఇంత దూరం వస్తున్నానని సువర్ణమ్మ వివరించారు.
ఇదీ చదవండి: కుక్కపిల్లకు అన్నీ తానై.. వానరం సపర్యలు