Sabarimala Temple Rush Today : శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల గంటల కొద్ది క్యూలో ఉన్నా దర్శనం కావట్లేదు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు భక్తులు శబరిమల కొండ దిగి పందళంలో ఉన్న వలియాకోయికల్ శ్రీధర్మ శాస్త్రా ఆలయంలో అయ్యప్పకు నెయ్యితో పూజలు చేసి స్వస్థలాలకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. అయ్యప్ప ఆలయంలో భక్తులను దర్శనం జరిగేలా చూడాలని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు.
కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తుల బృందం పందళంలోని వలియాకోయికల్ శ్రీధర్మ శాస్త్రా ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. అయితే, చాలా మంది భక్తులు పందళంలోనే అయ్యప్పకు ఇరుముడి సమర్పించి తిరుగుపయనవుతారని ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ సమయంలో కూడా కొందరు భక్తులు ఇలానే చేశారని చెప్పారు. ప్రస్తుతం శబరిమల వద్ద రద్దీ కారణంగా భక్తులు కొండ దిగి పందళం ఆలయంలో అయ్యప్పను దర్శించుకుని వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.
తగ్గని ట్రాఫిక్ జామ్
శబరిమలకు వెళ్తున్న రోడ్లలో మంగళవారం కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబా చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు.
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ముందు నిరసన
తిరువనంతపురంలో ఉన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేరళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం ఉదయం ముట్టడించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విఫలమైందని నిరసన తెలిపారు.
'స్పందించిన సీఎం'
శబరిమలలో భక్తులకు కనీస సౌకర్యాలు, భద్రతా చర్యలు లేవనే ఆరోపణల నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
'రోజుకు లక్ష మందికిపైగా భక్తులు రావడం వల్లే'
రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. శబరిమలలో రద్దీని విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటాన్నాయని అన్నారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తే సమస్యలు సాధారణమేనని అభిప్రాయపడ్డారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్- వారి కోసం 'అయ్యన్' యాప్, ఇక మరింత ఈజీగా దర్శనం!
శబరిమల భక్తులకు గుడ్న్యూస్- అయ్యప్ప స్వామి దర్శన సమయం పెంపు