Sabarimala Makaravilakku 2024 : 41 రోజుల మండల పూజల అనంతరం మూతపడిన శబరిమల అయ్యప్ప ఆలయం, మకరజ్యోతి ఉత్సవాల కోసం మళ్లీ తెరుచుకుంది. ఈ నెల 27వ తేదీన రాత్రి మూసివేసిన అయ్యప్ప ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన పూజారి కండారు మహేశ్ మోహనరారు సమక్షంలో మరో పూజారి పీఎన్ మహేశ్ నంబూద్రి శనివారం సాయంత్రం తెరిచారు.
Sabarimala Makara Jyothi 2024 Date : మకరజ్యోతి ఉత్సవాల్లో భాగంగా జనవరి 13న ప్రసాద శుద్ ధక్రియ, 14న బింబ శుద్ధ క్రియలను నిర్వహించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. 15న మకరజ్యోతి వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భక్తుల కోసం జనవరి 20వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అదే రోజున సన్నిధానంలో స్వామివారికి తిరువాభరణం, దీపారాధన ఉంటాయని తెలిపింది. జనవరి 20న పూజల అనంతరం దేవాలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించింది.
Sabarimala News Today : మరోవైపు, మకరజ్యోతి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు 1800 మంది పోలీసులు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో సీనియర్ అధికారులు ఉన్నారు. యాత్రికులతో పోలీసులు మంచిగా ప్రవర్తించాలని, అంకితభావంతో పనిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కన్నూరు రేంజ్ డీఐజీ థామ్సన్ జోస్ ఆదేశించారు. భక్తులందరికీ దర్శనం సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, యాత్రికుల పట్ల ఓపికగా ఉండాలని సూచించారు.
ఇక మండల పూజలు జరిగిన 41 రోజుల పాటు శబరిమలకు భారీగా భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో శబరిగిరులు కిక్కిరిసిపోయి అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. ఈ క్రమంలోనే భక్తుల రద్దీని కేరళ పోలీసులు నియంత్రించలేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 41 రోజుల మండల పూజల సీజన్‌కు భక్తులు పోటెత్తడం వల్ల మకరజ్యోతి సందర్భంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వర్చువల్ టిక్కెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Sabarimala Online Booking : మకరజ్యోతికి భారీగా భక్తులు పోటెత్తకుండా జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లను 50వేలకు తగ్గించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ పీసీ ప్రశాంత్ చెప్పారు. యాత్రికుల రద్దీని ఊహించి ముందస్తు బుకింగ్‌లు లేకుండా ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్‌లను 10వేలకు పరిమితం చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ రెండు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా పంబకు వెళ్లే బదులు నిలక్కల్‌లో స్పాట్ బుకింగ్‌లను చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
శబరిమల ప్రసాదం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? - అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి!
రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం- అయ్యప్పను దర్శించుకున్న 32 లక్షల మంది భక్తులు