కేరళ శబరిమలలో పవిత్రమైన మకరజ్యోతి వెలిగే కొండపై కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా పూజలు నిర్వహించడం వివాదాస్పదమైంది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.. పొన్నాంబలమేడు కొండపై కూర్చొని పూజలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. మంత్రాలు చదువుతూ, పూలు, ఆకులు చల్లుతూ ఆ వ్యక్తి పూజలు చేశాడు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తితో పాటు మరో నలుగురు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నాంబలమేడు కొండపై పూజలు చేస్తున్నామని ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడటం వీడియోలో వినిపిస్తోంది.
పూజ చేసిన వ్యక్తిని నారాయణ స్వామిగా గుర్తించారు. గతంలో అతడు శబరిమల ఆలయ పూజారి వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. నాలుగు రోజుల క్రితమే వీరు పూజలు చేసినట్లు సమాచారం. అతడి బృందంలోని ఓ వ్యక్తి.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. వారు ఆ కొండపై నుంచి శబరిమల ఆలయాన్ని సైతం వీడియో తీశారు. పటిష్ఠ భద్రత ఉండే ఈ కొండపై పూజలు చేయడంపై దేవస్థానం బోర్డు అధికారులు సీరియస్ అవుతున్నారు.
"ఈ వ్యవహారం అయ్యప్ప భక్తుల మనోభావాలకు సంబంధించినది. రాష్ట్ర డీజీపీతో పాటు అటవీ శాఖ చీఫ్‌కు దీనిపై ఫిర్యాదు చేశాం. వీడియోలో కనిపిస్తున్న నిందితుడి పేరు నారాయణ స్వామి. కొన్నేళ్ల క్రితం శబరిమల ఆలయంలో ఉప పూజారిగా పనిచేశారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని పనిలో నుంచి తీసేశాం."
- కె. అనంతగోపన్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు
పొన్నాంబలమేడు కొండపై ఏటా మకరజ్యోతి వెలుగుతుంది. ఈ కొండ శబరిమల ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కొండ.. రాష్ట్ర అటవీ శాఖ అధీనంలో ఉంటుంది. నిందితులు భద్రతా సిబ్బంది లేని మరో మార్గం నుంచి వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే, వీరి వాదనను అనంతగోపన్ కొట్టిపారేశారు. అంతమంది కలిసి హైసెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించి పూజలు ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. అయ్యప్ప స్వామి ఆలయం పవిత్రతకు భంగం కలిగించేందుకు నిందితులు కావాలనే పూజలు చేసి ఉంటారని అన్నారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై దుమారం చెలరేగిన నేపథ్యంలో నిందితుడు నారాయణ స్వామి స్పందించాడు. ఓ ప్రైవేటు ఛానల్‌తో మాట్లాడిన అతడు.. పూజలు చేసిన ప్రాంతం పొన్నాంబలమేడు (మకరజ్యోతి వెలిగే కొండ) కాదని చెప్పుకొచ్చాడు.
వివాదాల స్వామి
నారాయణస్వామిపై అనేక వివాదాలు ఉన్నాయి. శబరిమల ప్రధాన పూజారి అనే నేమ్‌ప్లేట్‌ను కారుకు తగిలించుకొని ప్రయాణించిన కేసులో పోలీసులు అతడిని ఇదివరకే అరెస్ట్ చేశారు. ఉప పూజారిగా పనిచేసిన సమయంలో.. శబరిమలకు వచ్చిన భక్తులకు నకిలీ పూజ టోకెన్లు ఇచ్చాడనే కేసు సైతం అతడిపై నమోదైంది.