Russia Ukraine war: రష్యా దాడితో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ కోసం భారత సంతతి ఇంజినీర్ గొప్ప మానవతా సాయం చేస్తున్నారు. అత్యవసరమైన వైద్య ఉత్పత్తులను సరఫరా చేసి వందలాది ప్రాణాలను కాపాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బ్రిజేంద్ర రానా ఇప్పటివరకు రూ.40 కోట్లు విలువైన వైద్య పరికరాలు, ఉత్పత్తులను ఉక్రెయిన్‌కు ఉచితంగా అందించారు. ఆయన మానవతా దృక్ఫతానికి అందరూ సలాం కొడుతున్నారు.
Rana helping Ukraine: ఇంజినీరింగ్ చదివేందుకు 1992లో ఖార్కీవ్‌కు వెళ్లిన బ్రిజేంద్ర రానా.. అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. ఓ స్నేహితుడితో కలిసి ఫార్మాస్యుటికల్ కంపెనీని స్థాపించారు. 'అనంత మెడికేర్' పేరుతో ప్రారంభించిన ఈ ఫార్మా కంపెనీ.. మంచి లాభాలతో కొనసాగింది. ఇప్పుడు ఇదే కంపెనీ ద్వారా వందలాది మంది ప్రాణాలు కాపాడే ఔషధాలను సరఫరా చేస్తున్నారు రానా. ప్రభుత్వ అధికారుల సమన్వయంతో సాయం అందిస్తున్నారు.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రష్యా సైన్యం కనికరం లేకుండా జనావాసాలపైనా దాడులు చేస్తోంది. దీంతో వేలాది మంది పౌరులు గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖార్కీవ్ మేయర్.. బ్రిజేంద్ర రానాను సంప్రదించారు. బాధితుల కోసం ఔషధాలు సరఫరా చేయాలని అభ్యర్థించారు. ఇప్పటివరకు రూ.40 కోట్లు విలువైన ఔషధాలను ప్రభుత్వానికి అందించినట్లు యూపీ బాగ్‌పత్‌లో ఉండే రానా అల్లుడు నవీన్ రానా వెల్లడించారు. కొంతమంది బాధితులకు వ్యక్తిగతంగా సహాయం చేశారని చెప్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ స్వచ్ఛంద సేవలోనే నిమగ్నమయ్యారని తెలిపారు.
మూడు దశాబ్దాల నుంచి ఖార్కీవ్లో ఉంటున్న రానాకు భార్య, ఓ కూతురు ఉన్నారు. వీరిద్దరినీ భారత్‌కు సురక్షితంగా పంపించాలని భావించారు. ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దుకు ఇద్దరినీ తరలించారు. అయితే, కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ భారత్‌కు చేరుకోలేకపోయారు. రానా మాత్రం ఉక్రెయిన్ను వీడేందుకు ప్రయత్నించలేదు. ఆయన ప్రస్తుతం యుద్ధ భీతి తక్కువగా ఉన్న పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉంటున్నారు. భారత్‌లో ఉన్న తమ బంధువులు మాత్రం వెనక్కి వచ్చేయాలని రానాపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఆయన మాత్రం ఉక్రెయిన్ను సొంత దేశంలా భావిస్తూ పోరాడుతున్నారు. ఈ విషయంలో భార్య, కూతురు సైతం ఆయనకు మద్దతు ఇస్తున్నారు.
ఇదీ చదవండి: రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు.. లెక్కించలేక సిబ్బంది తంటాలు