ముక్కులో రబ్బర్‌తో మూడు నెలలుగా ఓ బాలిక నరకయాతన అనుభవించింది. జలుబు అనుకుని ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దీంతో ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదించగా ముక్కులోంచి రబ్బర్‌ను తొలగించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
ఇదీ జరిగింది.. రాజ్‌కోట్‌లో ప్రాంతంలో మధన్ భాయ్ నివసిస్తున్నారు. అతడికి శివాని త్రివేది(10) అనే కుమార్తె ఉంది. కాగా, శివానికి మూడు నెలల క్రితం ముక్కులోకి రబ్బర్ వెళ్లింది. అప్పటి నుంచి ఆ బాలిక ఆనారోగ్యం పాలైంది. తరచూ జలుబు చేయడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కలగడం, చెడు వాసన రావడం లాంటివి తీవ్రంగా ఉండేవి. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు.
దీంతో మధన్ భాయ్.. హిమాన్షు టక్కర్ అనే ఈఎన్టీ నిపుణుడి వద్దకు బాలికను తీసుకెళ్లాడు. ముక్కులో ఏదో ఇరుక్కుపోయిందని గ్రహించిన డాక్టర్.. శస్త్ర చికిత్స నిర్వహించాడు. దీంతో రబ్బర్ ముక్క బయటపడింది. మూడు నెలల నుంచి బాధపడుతున్న బాలికకు ఉపశమనం లభించింది. అయితే దీనిపై స్పందించిన డాక్టర్ హిమాన్షు.. బాలిక ముక్కులో మూడు నెలలుగా రబ్బర్ ఉన్నా తల్లిదండ్రులు గ్రహించలేకపోయారన్నారు. ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉంటే ప్రమాదం జరిగేదని.. విండ్ పైప్ బ్లాక్ అయ్యి ఉండేదని చెప్పారు. తరచూ పిల్లలు ఆడుకునే సమయంలో ఇలాంటి వస్తువులను ముక్కులో, చెవుల్లో పెట్టుకుంటారని.. అందుకే పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని అన్నారు.