తానూ కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన వ్యక్తినేనని (rahul gandhi kashmiri pandit) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తనకు తన సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా జమ్మూలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో (Rahul Gandhi News) రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"జమ్మూకశ్మీర్‌తో మా కుటుంబానికి అనుబంధం ఉంది. మా కుటుంబీకులు కూడా కశ్మీరీ పండిట్లే. ఇక్కడికి వచ్చి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు నా సొంతింటికి వచ్చినట్లు అనిపించింది. ఈ ఉదయం కొందరు కశ్మీరి పండిట్లు నన్ను కలిశారు. తమ కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని, భాజపా తమ కోసం ఏమీ చేయలేదని నా దృష్టికి తెచ్చారు. ఇవాళ నేను చెబుతున్నా.. కశ్మీరీ పండిట్ సోదరులకు నా వంతు ఏదైనా సాయం చేస్తా" అని రాహుల్ హామీ ఇచ్చారు. అక్కడి వారి చేత 'జై మాతా ది' అని నినాదాలు చేయించారు.
ఈ సందర్భంగా భాజపా, ఆరెస్సెస్‌పై విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌కున్న రాష్ట్ర హోదాను భాజపా లాగేసుకుందని విమర్శించారు. భాజపా-ఆరెస్సెస్ కలిసి జమ్మూకశ్మీర్ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ లద్దాఖ్ కూడా వెళ్లనున్నారు. గురువారం ఇక్కడికి చేరుకున్న ఆయన 14 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
భాజపా విమర్శలు..
రాహుల్ వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. జమ్ముకశ్మీర్‌లో సమస్యలు గాంధీ కుటుంబం వల్లే ఏర్పడ్డాయని పేర్కొంది. కాంగ్రెస్ కారణంగా కశ్మీర్ పండిట్లు నష్టపోవడమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కూడా ఆగిపోయిందని తెలిపింది. రాహుల్.. పరిణితి చెందని, బాధ్యతారహిత నేతగా వ్యవహరిస్తున్నారని భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి : ఆస్ట్రేలియా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ భేటీ ఫలప్రదం