గడిచిన మూడేళ్లలో భారత్‌లోని 18 వేలకు పైగా ఎన్జీవోలకు రూ.49 వేల కోట్ల మేర విదేశీ నిధులు (Foreign funding) అందాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2017-18లో రూ. 16,940.58 కోట్లు, 2018-19లో 16,525.73 కోట్లు, 2019-20లో 15,853.94 కోట్ల నిధులను ఎన్జీవోలు విదేశీ సంస్థల నుంచి స్వీకరించినట్లు రాయ్ తెలిపారు.
ఫారిన్ కంట్రిబ్యూషన్(రెగ్యులేషన్) సవరణ చట్టం - 2020కి ముందు ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలు ఏ షెడ్యూల్డ్ బ్యాంకు బ్రాంచీల్లోనైనా తెరుచుకునేందుకు వీలుండేదని రాయ్ చెప్పారు. అయితే గత ఏడాది చట్ట సవరణ చేయడం వల్ల ఎన్జీవోలు విదేశీ సంస్థల నుంచి నిధులు తీసుకోవాలంటే.. తప్పనిసరిగా దిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచీలో ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలను తెరవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జులై 31 నాటికి దిల్లీ ఎస్‌బీఐ బ్రాంచీలో 18,377 ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి : ఆమెకు పింఛను ఇచ్చేందుకు అడవిలో 25 కి.మీ నడుస్తూ...