15 lakh in jan dhan account: తన జన్‌ధన్ ఖాతాలో జమైన లక్షల రూపాయలను ఖర్చు చేసిన రైతుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ డబ్బు తమదని, పొరపాటున తన ఖాతాలో జమైందని, తక్షణమే చెల్లించాలని గ్రామ పంచాయతీ డిమాండ్ చేస్తోంది.
అంతా మోదీ చలవే!
Jan dhan account wrong deposits: ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే.. మహారాష్ట్ర ఔరంగాబాద్ పైఠన్ తాలూకా దావర్వాడీ గ్రామానికి చెందిన ఓ రైతు. కొంతకాలం క్రితం తన బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జీరో బ్యాలెన్స్ జన్‌ధన్ ఖాతాలో ఏకంగా రూ.15లక్షలు ఉండడమే అందుకు కారణం. అప్పుడే ధ్యానేశ్వర్‌కు 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ప్రచారం గుర్తొచ్చింది. 'ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమ' అనే నినాదం అతడి చెవుల్లో మార్మోగింది. అసలే అది ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద తెరిచిన ఖాతా.. అందులోనూ రూ.15లక్షలు... రెండూ సరిపోయాయి. ఈ డబ్బంతా మోదీనే తన ఖాతాలో జమ చేశారని సంబరపడిపోయాడు ధ్యానేశ్వర్.
15 lakh credited to farmer bank ac:
ధ్యానేశ్వర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చుట్టుపక్కల వారంతా అతడ్ని అభినందనలతో ముంచెత్తారు. ధ్యానేశ్వర్ వెంటనే ప్రధాని కార్యాలయానికి ఓ ఈమెయిల్ పంపాడు. ఎన్నికల హామీని నెరవేర్చుతూ, తన ఖాతాలో రూ.15లక్షల జమ చేసినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపాడు. తన ఖాతాలోని సొమ్ము నుంచి రూ.9లక్షలు తీసి.. గ్రామంలో ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన రూ.6లక్షలను ఖర్చు చేయాలా, దాచుకోవాలా అని ఆలోచిస్తున్నాడు.
తూచ్... అది మా డబ్బు...
ఒక్కసారిగా లక్షలు వచ్చాయన్న ఆశ్చర్యం, సొంతింట కల నెరవేరిందన్న ఆనందం మధ్య ధ్యానేశ్వర్‌కు ఓ లేఖ అందింది. "జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీకు వచ్చాయి. ఆ డబ్బు మొత్తాన్ని సత్వరమే తిరిగి చెల్లించాలి" అన్నది ఆ లేఖ సారాంశం. ఇది చదివిన వెంటనే అతడి గుండె పగిలినంత పనైంది. తన ఖాతాలో మిగిలి ఉన్న రూ.6లక్షలను తక్షణమే తిరిగి చెల్లించేసినా.. ఇంటి కోసం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.9లక్షలను ఎలా ఇవ్వాలా అని తలపట్టుకుంటున్నాడు ధ్యానేశ్వర్.
ఇదీ చదవండి: మెటావర్స్‌లో వివాహ రిసెప్షన్.. దేశంలో ఇదే మొదటిసారి!