Brij Bhushan Sharan Singh Bail : మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేశారన్న కేసులో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ బెయిల్ పిటిషన్‌ను దిల్లీ పోలీసులు వ్యతిరేకించని నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు WFI ఉప కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని వీరిని ఆదేశించింది. కేసును పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు.. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.
కాగా, బ్రిజ్ భూషణ్‌తో పాటు WFI ఉప కార్యదర్శి వినోద్ తోమర్‌కు జులై 18న మధ్యంతర బెయిల్‌ను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేయగా.. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు రెగ్యులర్ బెయిల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా దిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్ పిటిషన్‌ను తాము వ్యతిరేకించడం లేదని, అలాగని మద్దతు కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే తాను చెప్పగలనని కోర్టులో పేర్కొన్నారు.
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేయగా.. ఈ కేసులో దిల్లీ పోలీసులు జులై 7న ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అనంతరం నిందితులకు సమన్లు జారీ చేసింది.
Wrestlers Protest At Jantar Mantar : WFI చీఫ్ బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు మహిళా రెజ్లర్లు జనవరిలో దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. దిల్లీ పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించడంలేదని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులతోపాటు, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత లైంగిక ఆరోపణలు చేసిన మైనర్ బాలిక ఫిర్యాదును ఉపసంహరించుకోవడం వల్ల పొక్సో కేసును తొలగించారు.
రెజ్లర్ల ఆరోపణలు ఏంటంటే?
Wrestlers Protest Reason : బ్రిజ్ భూషణ్ తమతో అనుచితంగా ప్రవర్తించేవారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. దగ్గరకు పిలిచి ఒంటిపై దుస్తులు లాగేవాడని ఆరోపించారు. శ్వాసక్రియను పరిశీలిస్తానని చెప్పి ఛాతిని తాకేవాడని ఓ రెజ్లర్ వాపోయారు. కోచ్ లేని సమయంలో తమను వేధింపులకు గురిచేసేవారని మరో రెజ్లర్ పోలీసులకు తెలిపారు. అంతర్జాతీయ పోటీలో గాయపడ్డప్పుడు.. తనతో సన్నిహితంగా ఉంటే వైద్య ఖర్చులు ఫెడరేషన్ భరించేలా చూస్తానని బ్రిజ్ భూషణ్ చెప్పినట్లు మరో రెజ్లర్ ఆరోపించారు. అయితే, రెజ్లర్ల ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఆ ఆరోపణలు నిజమైతే తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.