Road Accident in Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు, వారి మేనల్లుడు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డాడు.
ఈ సంఘటన మసోబా వాడి ఫటా గ్రామానికి సమీపంలో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సతీశ్ పంజుమల్ టెక్వానీ(58) ఆయన ఇద్దరు సోదరులు శంకర్(46), సునీల్(48), మేనల్లుడు లఖన్ మహేశ్ టెక్వానీగా (20) గుర్తించారు. వారంతా బీడ్ నగరం నుంచి అహ్మద్‌నగర్ జిల్లా కేంద్రానికి వెళ్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు.
వివాహానికి హాజరై వస్తుండగా: ఝార్ఖండ్ సరాయ్‌కేలా ఖర్సావాన్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాండిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్గు పూలియా ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జంషెడ్‌పుర్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఉర్మాల్ గ్రామానికి చెందిన వారు వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఐదుగురు మృతి: ఉత్తర్‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రేస్ వేపై గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అందులో నలుగురు మహారాష్ట్ర, ఒకరు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారితో పాటు ఎస్యూవీ వాహనంలో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 'మహీంద్రా బొలెరోలో ఏడుగురు ఆగ్రా నుంచి నోయిడా వైపునకు వెళ్తున్నారు. జెవార్ టోల్ ప్లాజాకు సమీపంలో డంపర్ ట్రక్కును ఢీకొట్టారు.' అని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: రోడ్డు దాటుతూ బైకర్పై నుంచి జింక హైజంప్.. ఒక్క కిక్‌తో..
కుమారుడికి గుడి కట్టిన తల్లిదండ్రులు.. నిత్యం పూజలు చేస్తూ..!