చదువులో ఫెయిలైనా జీవితంలో గెలిచాడా యువకుడు. తన ప్రతిభతో అద్భుతం చేశాడు. ర్యాంకులు ముఖ్యం కాదు సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి చక్కటి ఉదాహరణగా నిలిచాడు. అతడే బంగాల్ తూర్పు బర్ధమాన్‌లోని ఘోలా ప్రాంతానికి చెందిన రెజాల్ షేక్.
సరిగా చదవలేక ఫెయిలై ఐదో తరగతిలోనే స్కూల్‌కు పుల్‌స్టాప్ పెట్టేశాడు షేక్. ఇప్పుడు మాత్రం అంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు. సొంతంగా హెలికాప్టర్ తయారుచేశాడుగా మరి. అతడి ఆవిష్కరణకు స్నేహితులు, గ్రామస్థులు అంతా ఆశ్చర్యపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది షేక్ తయారుచేసిన హెలికాప్టర్‌ను చూసేందుకు వస్తున్నారు.

ఇప్పటికే వ్యాపార రంగంలో విజయవంతమైన షేక్‌కు హెలికాప్టర్ తయారుచేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులేం ఎదురుకాలేదు. అతడికి ఆర్కెస్ట్రా టీంతో పాటు జేసీబీ బిజినెస్ కూడా ఉంది. ఆవిష్కరణకు అసలు కారణం అతడి తండ్రేనట. 'ఏదైనా ప్రత్యేకంగా చేస్తేనే దేశం గుర్తుంచుకుంటుంది' అన్న ఆయన మాటలు అతడిలో ఉత్సాహాన్ని నింపాయి. తండ్రి కోరికను నెరవేర్చాలని.. హెలికాప్టర్ తయారీకి సంకల్పించుకున్న షేక్ దానిని నిజం చేశాడు.
హెలికాప్టర్ తయారీకి మొత్తం రూ. 30 లక్షలు ఖర్చు అయిందని షేక్ ఈటీవీ భారత్‌తో చెప్పాడు. సాధారణంగా ఇతర హెలికాప్టర్ తయారీకి అయ్యే ఖర్చులో దాదాపు ఇది సగం మాత్రమే.

కోల్‌కతా, పానాగఢ్ నుంచి హెలికాప్టర్ తయారీ పరికరాలను సమకూర్చుకున్న షేక్.. కర్ణాటక నుంచి హెలికాప్టర్ ఇంజిన్‌ను సేకరించాడు. ఐదుగురు కూర్చునేలా దీనిని తయారుచేశాడు. అయితే.. ఇది ప్యాసింజర్ హెలికాప్టర్ కాదని, భారీ వస్తువులను రవాణా చేసేందుకు వీలుండేలా సృష్టించినట్లు చెప్పుకొచ్చాడు. మరో 6 నెలల్లో మిగతా పనులు అన్నీ పూర్తవుతాయని, అప్పుడు ఆకాశంలోకి ఎగిరే వీలుగా అనుమతులు వస్తాయని యువకుడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇవీ చూడండి : సగం షేవింగ్ చేశాక డబ్బులు డిమాండ్.. గొడవ ముదిరి రెండు హత్యలు, ఆస్తులు ధ్వంసం