Employee Swallows Bribe Money : లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అడ్డంగా బుక్కైయ్యాడు. ఊహించని రీతిలో ఎదురుగా అధికారులు కనిపించేసరికి.. ఏం చేయాలో తెలియక లంచం డబ్బులను మింగేశాడు రెవెన్యూ ఉద్యోగి. ఈ ఘటన మధ్యప్రదేశ్.. ముడ్వారా జిల్లాలోని కట్నీ నగరంలో జరిగింది.
గజేంద్ర సింగ్ అనే వ్యక్తి కట్నీలో రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం అతడి వద్దకు వచ్చిన వ్యక్తిని రూ.5 వేల లంచం అడిగాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. దానిపై స్పందించిన అధికారులు.. గజేంద్ర సింగ్ లంచం తీసుకునేప్పుడు పట్టుకునేలా ప్లాన్ చేశారు. దానిలో భాగంగా గజేంద్ర సింగ్‌కు చెందిన ప్రైవేటు కార్యాలయంలో సదరు వ్యక్తి నుంచి రూ.5వేలు తీసుకుంటుండగా.. అక్కడ లోకాయుక్త అధికారులు ప్రత్యక్షమయ్యారు.
ఈ ఊహించని పరిణామంతో రెవెన్యూ అధికారి గజేంద్ర సింగ్ షాక్ అయ్యాడు. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యాడు. లంచం డబ్బులతో దొరికిపోకూడదనే ఉద్దేశంతో ఒక్కసారిగా వాటిని మింగేశాడు. అతడి ప్రవర్తన చూసి అధికారులు షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమై.. గజేంద్ర సింగ్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
'లంచానికి బదులుగా ఎద్దులు ఇస్తా'
కొన్నాళ్ల క్రితం.. కర్ణాటక బీదర్ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. ఉపాధి హామీ పథకం కింద తనకు రావాల్సిన బిల్లులను చెల్లించేందుకు లంచం అడిగారు అధికారులు. దీంతో తన రెండు ఎద్దులను లంచంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ప్రశాంత్ బిరాదార అనే రైతు.
తనకు బకాయి పడ్డ ఉపాధి హామీ పథకం నిధుల కోసం కొన్ని నెలలుగా బసవకల్యాణ్ తాలూకా గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మంజూరైన బిల్లులోని కొంత మొత్తాన్ని చెల్లించగా.. మిగతా డబ్బును చెల్లించేందుకు అధికారులు లంచం అడిగారు. రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని భావించిన ప్రశాంత్.. అధికారుల తీరుతో విసుగు చెందాడు. చివరకు తాను పెంచుకుంటున్న రెండు ఎద్దులను అధికారులకు లంచంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. వాటిని ఏకంగా పంచాయతీ కార్యాలయానికి తీసుకొని వచ్చాడు. తన దగ్గర డబ్బుల్లేవని.. వాటి స్థానంలో తన రెండు ఎద్దులను లంచం కింద తీసుకోవాలని ప్రశాంత్ అధికారులను కోరాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.