జమ్ముకశ్మీర్ ప్రజల్లో 'ఒక స్థాయిలో అపనమ్మకం' ఉందని, దాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సూచించారు. దిల్లీలో ప్రధాని నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన ఆయన శనివారం శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. 'ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ప్రయత్నాలు జరగాలి. దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయలేదు. 1996 ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు లోక్‌సభలో మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌కు స్వాతంత్ర్యం ఇవ్వం గానీ, స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ఆకాశమే హద్దు అని అన్నారు. మేం స్వాతంత్ర్యం కోరుకోవడం లేదు. స్వయంప్రతిపత్తే అడుగుతున్నాం. అదెక్కడ? ఈ కారణాల వల్ల ప్రజల్లో ఒక స్థాయిలో అపనమ్మకం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని తొలగిస్తుందో, కొనసాగిస్తుందో చూద్దాం' అని అన్నారు.
370 పునరుద్ధరణపై పోరాటం: ఒమర్
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించాలని 370 అధికరణం పునరుద్ధరణకు చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాటం చేస్తామని తెలిపారు. 370 అధికరణం రద్దయిన తరువాతే ఆరు పార్టీలు కలిసి పీఏజీడీగా ఏర్పడ్డాయని, కానీ ఈ సమావేశంలో ఆ స్ఫూర్తి కనిపించలేదని, దానిపై అందరూ కలిసికట్టుగా మాట్లాడలేదన్న విమర్శలను కొట్టిపారేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడకూడదని ఇద్దరు నాయకులు... కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ ఉపముఖ్యమంత్రి ముజఫర్ హుస్సేన్ బేగ్‌లు మాత్రమే అన్నారని చెప్పారు. వారిద్దరూ పీఏజీడీలో సభ్యులు కారని తెలిపారు. తొలుత రాష్ట్ర హోదాను పునరుద్ధరించిన తరువాతే అసెంబ్లీ ఎన్నికలు జరపాలని స్పష్టం చేసినట్టు చెప్పారు.
త్వరగా పరిష్కరించాలి...
దిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కశ్మీర్ నాయకులు తక్కువ డిమాండ్లనే ప్రభుత్వం ముందు ఉంచారని తెలిపారు. అందువల్ల వాటిని ఆమోదించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ అత్యవసరమని చెప్పారు.
ఇదీ చూడండి: Bihar politics: ఆర్జేడీతో చిరాగ్ పొత్తు!