Resident doctors strike: నీట్-పీజీ 2021 కౌన్సిలింగ్ నిర్వహణలో జాప్యంపై దిల్లీలో రెసిడెంట్ వైద్యులు తమ ఆందోళనను మరింత తీవ్రం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి ఆవరణలో వారు మంగళవారం భారీ సంఖ్యలో గుమిగూడి నిరసన తెలిపారు. అక్కడ 100మందికి పైగా పోలీసులు మోహరించి ఉండటం కొంత ఉత్కంఠ రేకెత్తించింది. సోమవారం తరహాలో మళ్లీ వైద్యులు, పోలీసుల మధ్య బాహాబాఙీ వంటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని తొలుత ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మంగళవారం అలాంటి ఉద్రిక్తతలేవీ కనిపించకపోవంట వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితులు అదులో ఉన్నాయని, రెసిడెంట్ వైద్యులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు.. నీట్ పీజీ కౌన్సిలింగ్ను త్వరగా నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం కోరింది. లేనిపక్షంలో బుధవారం అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలను నిలిపి వేస్తామని హెచ్చరించింది. కౌన్సిలింగ్ జాప్యంపై రెసిడెంట్ డాక్టర్ల సంఘం సమాఖ్య నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసనలు మంగళవారంతో 12వ రోజుకు చేరటం గమనార్హం.
కోర్టు పరిధిలో ఉండటం వల్లే..
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. నిరసనలను విరమించాలని రెసిడెంట్ డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఆ వైద్యుల ప్రతినిధుల బృందంతో దిల్లీలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. అందుకే తాము కౌన్సిలింగ్ నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. ఈ అంశంపై వచ్చే నెల 6న తదుపరి విచారణ జరగనుందని, ఆ లోపు అవసరమైన నివేదికను న్యాయస్థానానికి సమర్పించే దిశగా తాము చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కౌన్సిలింగ్ త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరఫున న్యాయస్థానాన్ని కోరతామని పేర్కొన్నారు. మరోవైపు.. వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని రెసిడెంట్ వైద్యుల నిరసన సమస్యను పరిష్కరించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.
సుప్రీం కోర్టుకు రెసిడెంట్ డాక్టర్లు..
నీట్-పీజీ కౌన్సెలింగ్లో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన క్రమంలో పోలీసులతో తలెత్తిన గొడవ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు రెసిడెంట్ డాక్టర్లు. సుమోటోగా స్వీకరించాలని కోరారు పిటిషనర్, న్యాయవాది వినీత్ జిందాల్. దేశంలో ఒమిక్రాన్ ముప్పు నిరంతరం పెరుగుతోందని, వైద్యుల సమ్మెపై తగిన చర్యలు తీసుకునెలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. నిరసన తెలిపిన వైద్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసుల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన పిటిషనర్.
ఇదీ చదవండి: పోలీసుల దాడిపై వైద్యుల నిరసన.. క్యాంపస్లో మళ్లీ ఉద్రిక్తత!