Republic Day 2024 Chief Guest : గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను జనవరి 26 వేడుకలకు ఆహ్వానించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న బైడెన్ తాను రాలేనని నిస్సహాయతను వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి కేంద్రం తరఫున ఆహ్వానం అందినట్లు తెలిసింది.
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో మోదీ
ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే పరేడ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సెప్టెంబరులో భారత్ వేదికగా దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో కూడా ఫ్రెంచ్ అధినేత ఇమ్మానియేల్ మేక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా ప్రధాని మోదీతో చర్చలు జరిగాయి' అని మేక్రాన్ తెలిపారు. ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌కు మోదీ హాజరుకావడాన్ని ఒక గొప్ప గౌరవంగా తమ దేశ ప్రజలు భావించినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు భారతదేశంలో ఉత్పత్తి రూపకల్పన ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ప్రధాని మోదీ జీ 20 సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్‌మ్యాప్‌ను కూడా వీలైనంత త్వరగా ఖరారు చేయాలని పిలుపునిచ్చారు.
ఆ దేశం నుంచి 6వ సారి
భారత్ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నేతలు ఇలా ముఖ్య అతిథులుగా హాజరుకావడం ఇది ఆరో సారి(2024లో మేక్రాన్). మేక్రాన్‌కు ముందు 1976, 1998లో ఆ దేశ ప్రధాని జాక్వెస్ చిరాక్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. 1980లో మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి'ఎస్టేయింగ్, 2008లో మాజీ అధ్యక్షులు నికోలస్ సర్కోజీ, 2016లో మాజీ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండ్ గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. కాగా, 2023 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్‌సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పదో తరగతి అర్హతతో బ్యాంక్ జాబ్స్- అప్లైకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
యూనివర్సిటీలో కాల్పుల కలకలం- 15మంది మృతి, మరో 9మంది పరిస్థితి విషమం!