దేశంలో జరిగే అతిపెద్ద వేడుక గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ఏటా జనవరి 26న అత్యంత అట్టహాసంగా దీన్ని జరుపుకొంటాం. త్రివిధ దళాల విన్యాసాలు, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన శకటాలతో రాజ్‌పథ్ వేదికగా జరిగే ఈ మువ్వన్నెల పండుగకు ఏటా ఓ దేశాధినేత ముఖ్య అతిథిగా హాజరవుతుంటారు. ఈ సారి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ వేడుకలకు హాజరవ్వాల్సి ఉండగా.. ఆయన పర్యటన అనూహ్యంగా రద్దైంది. బ్రిటన్‌లో కొత్తరకం వైరస్ కలవరపెడుతున్న దృష్ట్యా తాను ఈ వేడుకలకు రాలేకపోతున్నట్లు తెలియజేశారు. కరోనా పరిస్థితులు, తక్కువ సమయం ఉండడంతో మరో దేశాధినేతను ఆహ్వానించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి.
గణతంత్ర వేడుకలకు ఏటా విదేశాలకు చెందిన దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, భౌగోళిక రాజకీయాలు.. వంటి ఎన్నో వ్యూహాత్మక అంశాలు ఈ ఆహ్వానం వెనుక ముడిపడి ఉంటాయి. 1950లో తొలిసారి ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో రాకతో ఈ ఆనవాయితీ మొదలైంది. మధ్యలో 1952, 53 సంవత్సరాల్లో ఎవరినీ ఆహ్వానించలేదు. అయితే 1966లో అనూహ్య పరిణామంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది. అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ఆకస్మిక మరణంతో ఇందిరా గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఆమె జనవరి 24న ఆ పదవిని చేపట్టారు. ముఖ్య అతిథిని ఆహ్వానించే సమయం తక్కువగా ఉండడంతో అది సాధ్యపడలేదు. ఆ తర్వాత నుంచి ముఖ్యఅతిథి రాక నిరాటంకంగా సాగుతోంది.
ఆ ఏడాది 10 దేశాల అధినేతలు
అయితే, 2013లోనూ ఒమన్ రాజు పర్యటన వాయిదా పడింది. అప్పట్లో సమాచార లోపం కారణంగా ఆయన రాలేకపోయారు. ఆ ఏడాది భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. అలాగే 2019లో సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినా ఆయన హాజరయ్యేందుకు నిరాకరించారు. దీంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాను ఆహ్వానించడంతో ఆయన అంగీకరించి హాజరయ్యారు. గతేడాది బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో హాజరయ్యారు. కాగా.. 2018లో తొలిసారిగా 10 దేశాల అధినేతలు హాజరవ్వడం విశేషం. ఆసియాన్-భారత్ భాగస్వామ్యం పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్) బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల అధినేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'దేశాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చిన ఘనత మీదే'