30 ఏళ్లుగా మూగజీవులను రక్షిస్తున్న వేణుగోపాల మూగజీవాల పట్ల అపారమైన ప్రేమ ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జంతువులను రక్షించడమే వృత్తిగా పెట్టుకునే వాళ్లు చాలా తక్కువ. కర్ణాటక విజయనగర జిల్లా ఇంగళగి గ్రామానికి చెందిన వేణుగోపాల ఈ జాబితాలో ఒకరు. దాదాపు 30ఏళ్లుగా.. పాములు, కోతులతో పాటు ఇతర జంతువులను రక్షిస్తూ.. మూగజీవాల సంరక్షకుడిగా మారారు. 1990లో మొదలైన తన ప్రస్తానాన్ని ఇప్పటివరకు కొనసాగించడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.
మొదలైంది అప్పుడే..
పాములు పట్టే అలవాటు ఎప్పుడు మొదలైందన్న ప్రశ్నపై ఓ ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు వేణుగోపాల. ఓసారి పొలంలో తన తండ్రితో కలిసి భోజనం చేస్తుండగా.. ఓ సర్పం బారి నుంచి తన గుడ్లను రక్షించుకునేందుకు ఓ పక్షి చేసిన తీవ్ర పోరాటం తనను కదిలించిందని చెప్పారు. అప్పుడే మొదటిసారిగా ధైర్యం చేసి ఆ సర్పాన్ని బంధించినట్లు తెలిపారు.
30 ఏళ్లుగా సర్పాలను రక్షిస్తూ... 25 వేల సర్పాల రక్షణ..30 ఏళ్లుగా మూగజీవాల రక్షణ వృత్తినే కొనసాగిస్తున్న వేణుగోపాల.. ఇప్పటివరకు 25 వేల సర్పాలను రక్షించారు. మొసలి, ఎర్ర కోతి, ఎలుగుబంటి వంటి ప్రాణాంతక మూగజీవాలను సైతం రక్షించి అడవిలో వదిలారు. ఈ జంతువులను రక్షిస్తున్న సమయంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా మూగజీవాల రక్షకుడిగా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
పాములు పట్టుకోవడానికి ఓ ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తారు వేణుగోపాల. ఈ వృత్తిలో ఎన్నోసార్లు పాటు కాటుకు గురైనట్లు వేణు తెలిపారు. అయితే.. సర్పాలు ఇంట్లోకి వస్తే కీడు జరుగుతుందని చాలా మంది భావిస్తారని.. అది కేవలం అపోహ మాత్రమే అని వేణు చెబుతున్నారు. వాటిని ఒంటరిగా వదిలేస్తే అవే వెళ్లిపోతాయని.. ఎవ్వరికీ హాని తలపెట్టవని అంటున్నారు. మూగజీవాలను రక్షించడం బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.