పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు మరింత స్పష్టమవుతోంది. ఈ నెల 31న ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్కసారి మాత్రమే మంత్రివర్గ విస్తరణ జరగడం, సార్వత్రిక ఎన్నికలకు మరో 15-16 నెలల సమయమే మిగలడంతో ఈ నెలలోనే మార్పులు తథ్యమని దేశ రాజధాని వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడకున్నా ఈ నెల 16-17 తేదీల్లో దిల్లీలో జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పునర్వ్యవస్థీకరణ అంశం తెరమీదికి వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ సమావేశాల్లోపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉన్నట్లు ఇటీవల వినవస్తున్న సంగతి తెలిసిందే.
ఖాళీలు ఎందుకు ఏర్పడ్డాయంటే..
ఈ ఏడాది మధ్యలో కర్ణాటక, చివరలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలకు కేబినెట్‌లో ప్రాధాన్యం పెంచొచ్చని భావిస్తున్నారు.
- బిహార్, మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, శివసేన, అకాళీదళ్‌లు ఎన్డీయే నుంచి వైదొలగడంతో ఆ పార్టీలకు ఇదివరకు కేటాయించిన మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
- మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానాన్ని అలాగే ఉంచారు.
- బిహార్ భాజపా నాయకులను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని వినిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన శిందే వర్గానికి చెందినవారికీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
- ఉత్తర్‌ప్రదేశ్‌కూ ప్రాధాన్యం ఇవ్వొచ్చని సమాచారం. గుజరాత్‌లో పార్టీ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు సీఆర్ పాటిల్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
- ప్రస్తుత మంత్రుల్లో భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకుర్‌లకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చని అంచనా వేస్తున్నారు.
కేబినెట్ నుంచి తప్పించినవారికి పార్టీ విధులు
మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత బడుగు, బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నందున ఇప్పుడు కూడా ఆ వర్గానికి పెద్దపీట వేయొచ్చని అంచనా వేస్తున్నారు. పార్టీలో ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకొచ్చి, అక్కడినుంచి తప్పించిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2021 జులైలో పునర్వ్యవస్థీకరణలో ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్, రమేష్ పోఖ్రియాల్, హర్షవర్ధన్, డీవీ సదానందగౌడ, సంతోష్ గంగ్వార్ పదవులు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను చీల్చి భాజపాకు అధికారం దక్కేలా చేసిన జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్రలో నారాయణ్‌రావు రాణేకూ కొత్తగా స్థానం కల్పించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు..
మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవాలని పట్టుదలతో ఉన్న కారణంగా ఇప్పుడున్న కిషన్‌రెడ్డికితోడు మరొకరికి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆ రాష్ట్రం నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కె.లక్ష్మణ్, సోయం బాపురావులు భాజపా తరఫున ఎంపీలుగా ఉన్నారు. తొలి ముగ్గురూ ఒక సామాజికవర్గానికి చెందినవారే. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి మరో అవకాశం ఇస్తారా? లేదంటే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్టీలను ఆకట్టుకోవడానికి సోయం బాపురావును ఎంచుకుంటారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని ఎంచుకుంటారన్నది తేలడంలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో బయటివారిని తీసుకొచ్చి, ఆ తర్వాత వారిని రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు తీసుకురావడం మోదీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్, రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఇలాగే తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాంటివారెవరైనా రావొచ్చని మోదీ వ్యవహారశైలిని గమనిస్తున్న నాయకులు అంచనా వేస్తున్నారు.