రెమ్‌డెసివిర్ ఔషధానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు చేసింది. రెమ్‌డెసివిర్‌ను వైద్యులు జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించింది. కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రోగులకు ఈ ఔషదాన్ని వినియోగించాలని స్పష్టం చేసింది. ఇంట్లో చికిత్స తీసుకుంటున్నవారికి రెమ్‌డెసివిర్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.
"కరోనాతో బాధపడుతూ ఆక్సిజన్ అవసరమైన రోగులకు మాత్రమే రెమ్‌డెసివిర్ ఇవ్వాలి. ఎలాంటి లక్షణాలు లేకుండా హోం క్వారంటైన్‌లో ఉన్న వారు దీన్ని వినియోగించవద్దు. ప్రస్తుతానికి రెమ్‌డెసివర్ కొరత ఎక్కడా లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ మందు ఇవ్వాలని వైద్యులను కోరుతున్నాం. ఈ విషయంలో హేతుబద్ధత, న్యాయబద్ధత పాటించాలి."
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు
అదేసమయంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సైతం వైద్యులకు ఇవే సూచనలు చేసింది. రెమ్‌డెసివిర్‌ను న్యాయబద్ధంగా వినియోగించాలని కోరింది.
మరోవైపు, రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని రెట్టింపు చేసినట్లు ఔషధ తయారీ సంస్థ సిప్లా తెలిపింది. కరోనా కేసుల పెరుగుదల సహా, డ్రగ్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి పెంచినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో రెమ్‌డెసివిర్‌కు కొరత