ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు తన పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. తన తల్లిని కూతురిగా.. అమ్మమ్మను తన భార్యగా చెప్పుకుంటున్నాడు. మేనమామలిద్దరూ గత జన్మలో తన కుమారులని పేర్కొంటున్నాడు. ఆ బాలుడి చెప్పే మాటలతో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 2015 జనవరి 9న బాలుడి తాత మనోజ్ మిశ్ర చనిపోయాడు. రతన్పుర్లో ఉండే అతడు.. పొలంలో నీరు పారించేందుకు వెళ్లి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో మనోజ్ కుమార్తె రంజన.. గర్భంతో ఉంది. మనోజ్ చనిపోయిన 20 రోజులకే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి ఆర్యన్ అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆ బాలుడే ఇప్పుడు తన గత జన్మ గురించి చెబుతున్నాడు. రతన్‌పుర్ గ్రామం గురించి ప్రస్తావిస్తున్న అతడు.. తానే మనోజ్ మిశ్ర అని అంటున్నాడు.
జూన్ 15న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్.. విచిత్రంగా ప్రవర్తించాడు. ఆమె కాళ్లను మొక్కుతూ.. గత జన్మలో 'నువ్వు నా భార్యవి' అని అమ్మమ్మతో చెప్పాడు. తన పేరును మనోజ్‌గా చెప్పుకున్న ఆర్యన్.. తల్లి రంజనను తన కూతురని వివరించాడు. మేనమామలైన అజయ్, అనుజ్లను తన కొడుకులని చెప్పుకొచ్చాడు. అది చూసిన ఆర్యన్ మేనమామలు.. కన్నీరు మున్నీరై విలపించారు. తన పేరు మీద బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని ఆర్యన్ వెల్లడించాడు. ఈ వార్త విన్న గ్రామస్థులంతా.. ఆర్యన్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతడు చెప్పే మాటలు విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
'గత జన్మ గుర్తొచ్చింది.. లీవ్ ఇస్తే ఆ పని చేస్తా'.. బాస్‌కు సబ్ ఇంజినీర్ లేఖ..
కొద్ది రోజుల క్రితం కూడా.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సబ్ ఇంజినీర్ వింత కారణాలతో తన పైఅధికారులకు దరఖాస్తులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రతి ఆదివారం 'డే ఆఫ్' కావాలని అందులో అతడు పేర్కొనేవాడు. ఆ దరఖాస్తులో ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే..?
గత జన్మ గుర్తొచ్చి...
అగర్ మాల్వా జిల్లాలోని సంశేర్ జనపద్ పంచాయతీ చీఫ్‌కు.. సబ్ ఇంజినీర్ రాజ్‌కుమార్ యాదవ్ ఈ లేఖ రాశారు. అందులో తనకు కొద్దిరోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి, ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు 'డే ఆఫ్' ఇవ్వాలని కోరారు.
తాను భగవద్గీత బోధించిన మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నానని రాజ్‌కుమార్ తెలిపాడు. నాలో ఉన్న అహాన్ని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం భిక్షాటన చేయాలని భావించినట్లు అతడు వివరించాడు. ప్రతి ఇంటి నుంచి గోధుమలను యాచించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దానికోసమే నాకు ఆదివారం డే ఆఫ్ కావాలని.. తన దరఖాస్తులో అని రాజ్‌కుమార్ యాదవ్ తెలిపాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.