దేశంలో జనవరి నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థల అభ్యర్థనలను నిపుణులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఫైజర్ దరఖాస్తు సైతం పరిశీలనలో ఉందని వెల్లడించారు. నిపుణుల పరిధిలో ఉండే ఈ విషయంపై రాజకీయ నాయకులు మాట్లాడటం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. అయితే టీకా భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు హర్షవర్ధన్.
"టీకా భద్రతే మా తొలి ప్రాధాన్యం. ఆ విషయంలో రాజీ పడేది లేదు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం నియంత్రణ సంస్థల నుంచి వారు అనుమతి కోరారని తెలిసింది. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. దీన్ని నియంత్రణ సంస్థలు పరిశీలిస్తున్నాయి. నిపుణుల పరిధిలోని ఈ విషయంపై రాజకీయ నాయకులు మాట్లాడటం సముచితం కాదు."
-డా. హర్షవర్ధన్, కేంద్ర వైద్య శాఖ మంత్రి
స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపైనే భారత్ దృష్టిసారించిందని చెప్పారు హర్షవర్ధన్. టీకా పరిశోధనాభివృద్ధి విషయంలో భారత్ ఏ దేశానికీ తక్కువ కాదని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం పయనిస్తోందని పేర్కొన్నారు.
మరింత సమాచారం కోసం..
టీకా వినియోగానికి అనుమతులు ఇచ్చే అంశంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి చెందిన 'విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ)' పరిశీలన ప్రారంభించింది. వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్లను కోరింది. టీకాపై ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు మరింత సమయం కోరిన నేపథ్యంలో ఫైజర్ సంస్థ దరఖాస్తుపై తొలి సమావేశంలో నిపుణులు చర్చించలేదు.
ఇదీ చదవండి: భారత్‌లో టీకా వినియోగానికి తొలి దరఖాస్తు