కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని(Covishield dose gap) తగ్గించడంపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాంకేతిక సలహా మండలిలోని నిపుణులు దీనిపై చర్చించనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు నిపుణులు సానుకూలత వ్యక్తం చేస్తే.. డోసుల మధ్య వ్యవధి తగ్గనుంది.
కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది కేంద్రం. అప్పటివరకు ఉన్న 6-8 వారాల వ్యవధిని.. 12-16 వారాలకు పెంచింది. డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల వ్యాక్సిన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తాయని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(NTAGI) నిపుణుల బృందం చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది.
'ప్రతిపాదన లేదు'
అయితే, డోసుల వ్యవధి పెంచే ప్రతిపాదనలేవీ ఇంకా తమ వద్దకు రాలేదని నిపుణుల బృందం(NTAGI) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోడా చెప్పారు. కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలకూ డోసుల వ్యవధిని మార్చాలనే ఉద్దేశం లేదని అన్నారు. ప్రస్తుతం టీకా సమర్థతను అంచనా వేసే డేటా సేకరణ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. టీకాల సమర్థతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్‌లో 20 కోట్ల డోసులు
మరోవైపు, సెప్టెంబర్‌లో 20 కోట్ల డోసుల టీకాలను(Covishield doses) అందించనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(Serum Institute of India) కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఆగస్టులో 12 కోట్ల డోసులను సరఫరా చేసినట్లు వెల్లడించారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకుందని, సెప్టెంబర్‌లో మరిన్ని డోసులను అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్నారు.
దేశీయ దిగ్గజ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తోంది. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి ఈ టీకాను అభివృద్ధి చేశాయి.
ఇదీ చదవండి: ప్రభుత్వ బడుల్లో చదివితే 7.5% రిజర్వేషన్