కరోనా టీకాల వృథాను 1 శాతం లోపునకు తగ్గించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ ఉందని.. అదే సమయంలో కొరత కూడా ఉందన్న విషయం గుర్తు పెట్టుకుని టీకాలను వృథా చేయవద్దని స్పష్టం చేసింది. ఒక డోసు టీకాను వృథా కాకుండా చేస్తున్నామంటే.. మరొకరికి టీకాను ఇస్తున్నట్లేనని పేర్కొంది.
టీకా వృథాను ఒక శాతం లోపునకు కట్టడి చేయడం సాధ్యం కాదని కొన్ని మీడియా సంస్థలు అనడాన్ని కొట్టిపారేసింది.
ఓపెన్ వయల్ పాలసీ( ఒక సారి కరోనా టీకా బాటిల్ తెరిస్తే, నియమాలకు లోబడి కాలపరిమితిలో వినియోగించాలి)లో కరోనా టీకా లేదని తెలిపింది. వ్యాక్సిన్ వయల్ ఓపెన్ చేసిన 4 గంటల్లో మొత్తం వాడాలని స్పష్టం చేసింది.
'భయాల్ని తొలగించండి'
కరోనా టీకాపై గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తల్లో భయాలున్నాయన్న వార్తలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పందించింది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రప్రభుత్వాలు.. ఆయా ఆరోగ్య కార్యకర్తలతో చర్చించి సందేహ నివృత్తి చేయాలని సూచించింది. గిరిజన ప్రాంత ప్రజలకు టీకాపై అవగాహన కల్పించాలని కోరింది.
ఇదీ చదవండి: కరోనా టీకా తీసుకున్న 125 ఏళ్ల బాబా