జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా సంభవించిన వరదల ధాటికి 9 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని మరో 12 మందికి గాయాలయ్యాయని ఎస్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వి.కె. సింగ్ తెలిపారు. మరో 25 మందికి పైగా గల్లంతయ్యారని వెల్లడించారు. ఆకస్మిక వరదలు గులాబ్‌గఢ్ గ్రామాన్ని ముంచెత్తాయని వివరించారు. పోలీసులు, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదల వల్ల 9 ఇళ్లు కొట్టుకుపోయాయని గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. శిధిలాల కింద చిక్కుకున్న 5 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయ చర్యలు సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో రెండు గ్రామాలను వరదలు ముంచెత్తాయని కానీ ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు.
![Extremely Heavy Rains in north india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12601428_jk2.jpg)
![Extremely Heavy Rains in north india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12601428_jk.jpeg)
ఎడతెరిపిలేని వానలు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల జమ్మూకశ్మీర్‌లోని పద్దర్ ప్రాంతం నుంచి 60 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడతాయని అప్రమత్తంగా ఉండాలని కిష్టావర్ జిల్లా పరిపాలన యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదలపై లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీని అడిగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి వెళ్తున్నాయని ట్వీట్ చేసిన అమిత్ షా..వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటమే తమ ప్రాధాన్యత అన్నారు. ప్రజలను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
![Extremely Heavy Rains in north india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12601428_uk3.jpg)
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి..
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఆకస్మిక వరదలు కల్లోలం సృష్టించాయి. వరదల్లో ఇప్పటి వరకూ తొమ్మిది మంది చనిపోగా, మరో ఏడుగురు గల్లంతయ్యారని ఎస్డీఆర్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కులు జిల్లాలోని ఓ జలవిద్యుత్ కేంద్రం వద్ద మహిళ సహా నలుగురు, లాహాల్-స్పితి జిల్లాలో ముగ్గురు చనిపోయారని ఎస్డీఆర్ఎఫ్ డైరెక్టర్ సుదేష్ కుమార్ తెలిపారు. లాహౌల్-స్పీతి జిల్లాలో సంభవించిన వరదల్లో పది మంది గల్లంతయ్యారు. లాహౌల్‌కు వచ్చే రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. సిమ్లాలో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. కులులో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తిందని ఎస్డీఆర్ఎఫ్ తెలిపింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
![Extremely Heavy Rains in north india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12601428_uk85.jpg)
![Extremely Heavy Rains in north india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12601428_uk.jpg)
ఉత్తరాఖండ్‌లోనూ వరద విలయం..
ఉత్తరాఖండ్‌లోనూ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు నదీ జలాలు దెహ్రాదూన్‌లోని తప్‌కేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి ప్రవేశించాయి. గంగోత్రిలోనూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
![Extremely Heavy Rains in north india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12601428_uk8.jpg)
ఇదీ చూడండి: మహారాష్ట్రలో వరద బీభత్సం- 209కి చేరిన మృతులు