బంగాల్‌కు అదనపు టీకాలు, ఔషధాలు కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. రెండో దశ కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ట్విట్టర్లో తెలిపారు.
"దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. బంగాల్ ప్రజలను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. అదనపు టీకాలు, ఔషధాలు అందించాలని ప్రధానిని కోరాను."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
మహమ్మారిని నియంత్రించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మమత చెప్పారు. బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రణాళికను వెల్లడిస్తారని పేర్కొన్నారు.
వేసవి సెలవులు..
కొవిడ్ పరిస్థితి దృష్ట్యా మంగళవారం(ఏప్రిల్ 20) నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది బంగాల్ ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలను కూడా ఈ ఆదేశాలు పాటించాలని కోరనుంది. చాలా మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఇదీ చూడండి: దిల్లీలో లాక్డౌన్- లిక్కర్ షాపుల ముందు భారీ క్యూ