Rawat helicopter crash: తమిళనాడు కూనూర్‌లో డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మరో 11మంది సైనికులు దుర్మరణం చెందారు. ఆ మరుసటి రోజున ప్రమాదంపై కేసు నమోదు చేశారు అప్పర్ కూనూర్ స్టేషన్ పోలీసులు.
ఆ తర్వాత నీలగిరి జిల్లా అదనపు ఎస్పీ ముత్తుమానికం నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు టీంను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. గత నాలుగు రోజులుగా ఈ టీం దర్యాప్తు చేస్తోంది.
ఫోన్ స్వాధీనం..
దర్యాప్తులో భాగంగా హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు వీడియో తీసిన వ్యక్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు ఆదివారం ఓ ప్రకటన చేశారు నీలగిరి పోలీసులు. అలాగే.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో హైట్రాన్స్మిషన్ విద్యుత్తు తీగలు, హైఓల్టేజ్ పోల్స్ ఉన్నాయా? అనే విషయాన్ని తెలపాలని తమిళనాడు విద్యుత్తు సంస్థకు లేఖ రాసినట్లు తెలిపారు. మరోవైపు.. చెన్నైలోని భారత వాతావరణ శాఖకు లేఖ రాశారు నీలగిరి పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కోరారు.
ప్రత్యక్ష సాక్షుల విచారణ
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కోంబింగ్ ఆపరేషన్ చేపట్టేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారు అధికారులు. ప్రత్యక్ష సాక్షులను వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంలో 13 మంది మృతి
డిసెంబర్ 8న మధ్యాహ్నం తమిళనాడు సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్టన్లోని సైనిక కళాశాలకు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మరో 11 మంది అధికారులు వెళుతున్న క్రమంలో కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: