ఏప్రిల్ 16న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. "వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలపై అమెరికా విధించిన ఆంక్షలను తొలగిస్తే ఉత్పత్తిని వేగవంతం చేస్తాము. మీ కార్యనిర్వహణ వర్గానికి వివరాలు మొత్తం తెలుసు" అని అందులో పేర్కొన్నారాయన. కానీ.. అమెరికా నుంచి దీనికి సానుకూల స్పందన రాలేదు. మరోవైపు భారత ప్రభుత్వం.. దేశంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేసింది. ఈ క్రమంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. ఈ ఏడాది ఉత్పత్తి చేయాల్సిన మరో టీకా నోవావాక్స్ కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. దీనిని ఈ సంవత్సరం దాదాపు 100 కోట్ల డోసులను ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొంది.
ఇదీ చదవండి: 'ప్రాణవాయువు'ను తోడేస్తున్న సెకండ్ వేవ్!
సమస్య ఏమిటి.?
సీరం సంస్థ ప్రస్తుతం.. ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇది కాకుండా అమెరికా కంపెనీ నోవావాక్స్తో అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాలను కూడా తయారు చేయాల్సి ఉంది. దీనిలో వినియోగించాల్సిన అడ్జువెంట్ అమెరికా నుంచి రావాల్సి ఉంది. కానీ, బైడెన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీకాల అవసరమైన ముడి పదార్థాలను డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి.. ఎగుమతులపై ఆంక్షలు విధించారు. ఫలితంగా.. అమెరికా కంపెనీలు ముడిపదర్థాల విక్రయంలో స్వదేశానికి తొలి ప్రధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా సీరం సంస్థకు ముడిపదర్థాలు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: స్పుత్నిక్-వి 10 రోజుల్లో భారత్‌లోకి!
అడ్జువెంట్ ఉపయోగం.?
టీకా తీసుకొన్న వ్యక్తిలో రోగనిరోధక శక్తి సదరు క్రిమిపై సమర్థంగా ప్రతిస్పందించేలా ప్రేరేపించేందుకు వినియోగించే పదార్థాన్ని అడ్జువెంట్ అంటారు. సాధారణంగా అల్యూమినియం మూలకంతో చేసిన అల్యూమినియం హైడ్రాక్సైడ్ వంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. పలు రకాలు ఉన్నాయి. దీనిలో క్యూఎస్-21 అనేది ఒకటి. క్విల్లాజా సపోనిన్స్(కుంకుడు వంటి ఒక రకమైన చెట్టు) నుంచి సేకరించి తయారు చేస్తారు. ఇది శరీరంలోని టీ కణాలను బలపర్చి వ్యాక్సిన్ బాగా పనిచేసేలా చేస్తుంది. నోవావాక్స్ కంపెనీ టీకాల్లో వాడే చాలా వరకు అడ్జువెంట్‌లు పేటెంట్లతో కూడినవి. వీటిని అమెరికా డీపీఏ చట్టంలో కఠిన ఆంక్షల మధ్య సరఫరా చేస్తారు.
ఇదీ చదవండి: 'వాటిని 2 నెలలు నిషేధిస్తేనే కరోనాకు అడ్డుకట్ట!'
ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యలతో నిరాశ.?
వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన ఆంక్షలు సడలించే విషయమై అగ్రరాజ్యం అమెరికా నుంచి స్పష్టమైన హామీ రాలేదు. కానీ.. భారత విన్నపాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని వెల్లడించింది. సీరం అభ్యర్థనపై అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోని ఫౌచీ స్పందిస్తూ.. "నేనేమీ చేయలేను. క్షమించండి. దానిపై తర్వాత కచ్చితంగా స్పందిస్తాము. ప్రస్తుతానికి నా చేతిల్లో ఏమీ లేదు" అని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తయారీలో అడ్జువెంట్‌తో పాటు బయో రియాక్టర్ బ్యాగ్స్, సింగల్ యూజ్ సిస్టమ్స్, సెల్‌కల్చర్ మీడియా, ఫిల్టర్స్, గామా స్టెర్లైజేషన్, వయల్స్ వంటి అంశాల్లో కూడా సమస్యలు ఉన్నాయి.
ఇదీ చదవండి: విదేశీ టీకాలపై దిగుమతి సుంకం రద్దు!
భారత్ బయోటెక్ దేశీయంగా..
దేశీయ కొవిడ్ వ్యాక్సిన్ నిర్మాత భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ముడి పదార్థాల విషయంలో కూడా ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకొంది. ఈ టీకాలో వినియోగించే కీలక పదార్థాలను దేశీయంగా అభివృద్ధి చేయడం కోసం మార్చిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ కలిసి పనిచేస్తోంది. ఈ కంపెనీ టీకాలో ప్రిజర్వేటీవ్‌స్‌ను జర్మనీ నుంచి, కొన్ని ముడి పదార్థాలు అమెరికా నుంచి వస్తున్నాయి.
ఇదీ చదవండి: మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు జాన్సన్ దరఖాస్తు