కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు జిల్లా వ్యాప్తంగా వివిధ వేషాలు వేసుకొని నగరంలో తిరుగుతుంటారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఇవేవీ జరగడం లేదు. కానీ, రవి కటపాడి(ravi katapadi udupi) అనే వ్యక్తికి మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే.. అతను చేస్తున్న పని తనకోసం కాదు. అణగారిన వర్గాలకు చెందిన చిన్నారుల కోసం.
ప్రతి ఏటా వినూత్నంగా తయారై ఉడుపి వీధుల్లో తిరుగుతాడు రవి. ఇంటింటికి వెళ్లి దానం చేయాలని అడుగుతాడు. సేకరించిన డబ్బునంతా చిన్నారుల వైద్యం కోసం ఖర్చు చేస్తాడు. తాజాగా 'డార్క్ ఎలైట్' అనే కాల్పనిక పాత్ర వేషాన్ని(ravi katapadi 2021) ధరించి నిధులు సేకరించాడు. ఇప్పటివరకు రూ.72 లక్షలు పోగు చేసి.. 33 మంది చిన్నారులను ఆదుకున్నాడు.
ఇలాంటి ఖరీదైన కాస్ట్యూమ్ ధరిస్తున్నాడంటే ఆయన ఏదో ధనవంతుడని అనుకుంటే పొరపాటే. రవి ఓ సాధారణ రోజువారీ కూలీ. ప్రజలకు తన వంతు సాయం చేద్దామన్న తపనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
"ఈసారి నలుగురు చిన్నారుల చికిత్స కోసం డబ్బులు పోగు చేశాం. అందులో రెండేళ్ల చిన్నారికి రూ.40 లక్షల చికిత్స అవసరం. యాక్సిడెంట్లో గాయపడ్డ మరో అబ్బాయికీ సాయం చేశాం. బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డ పదేళ్ల బాలుడు, మరో 16 ఏళ్ల అబ్బాయి చికిత్సకు సహకరించాం. నా అభ్యర్థన మేరకు ఉడుపి జిల్లా అధికారులు ప్రత్యేకంగా అనుమతులు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిధులు సేకరించవచ్చని చెప్పారు. ఈ సేవ చేసినందుకు నాకు సంతోషంగా ఉంది."
-రవి కటపాడి
రవి దాతృత్వ హృదయం వెనక విషాద గాధ దాగి ఉంది. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన రవి.. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాడు. అనంతరం పొట్టకూటి కోసం స్కూల్ మానేసి పని చేయాల్సి వచ్చింది. ఐదేళ్ల క్రితం.. తన తల్లిదండ్రులు, అన్నావదినలను పోగొట్టుకున్నాడు. ఇదే సమయంలో ఓ చిన్నారి అనారోగ్య పరిస్థితి గురించి రవికి తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి చెయ్యి పనిచేయకుండా పోయింది. సర్జరీకి డబ్బులు లేక చిన్నారి తల్లిదండ్రులు అయోమయ స్థితిలో పడ్డారు. ఆ సమయంలో.. రవి వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. వింత వింత వేషాల్లో తయారై డబ్బులు పోగు చేశాడు. అప్పటి నుంచి ప్రతి జన్మాష్టమికి ఇలా వేషాలు వేసి.. సాయం చేస్తున్నాడు.
కౌన్ బనేగా కరోడ్పతిలో..
ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 12లో రవి(ravi katapadi kbc) పాల్గొన్నాడు. ఇందులో రూ.8 లక్షలు గెలుచుకున్నాడు. ఇందులో ఒక్క రూపాయి కూడా సొంతంగా వాడుకోలేదు. మొత్తం డబ్బును పేద చిన్నారుల సంక్షేమం కోసం దానం చేశాడు.
ప్రశంసల వెల్లువ...
రవి చేస్తున్న మంచి పనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తనకు తోచిన విధంగా చిన్నారులకు సాయం చేయడాన్ని చూసి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి: assembly election 2022: నాలుగు రాష్ట్రాల్లో భాజపా.. పంజాబ్లో హంగ్!