బంగాల్, కోల్‌కతాలోని.. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 12 ఏళ్లుగా అరుదైన వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దీంతో ఆ బాలిక కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముర్షిదాబాద్‌లోని కాశీంనగర్ ప్రాంతానికి చెందిన మన్యోనా బీబీ కుమార్తె సోనావ.. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె 12 ఏళ్లుగా స్కోలియోసిస్ అనే అరుదైన వెన్నెముక వ్యాధితో బాధపడుతోంది. ఆ వ్యాధి వల్ల వెన్నెముక వంగిపోతుంది. ఈ వ్యాధి ఉన్న ఆ బాలిక సరిగ్గా నిలుచోలేక, నడవలేక చాలా ఇబ్బంది పడేది. ఆమెను ఎంతో మంది వైద్యులకు చూపించినా లాభం లేకుండాపోయింది. చివరకు కోల్‌కతాలోని నిల్ రతన్సర్కార్(ఎన్ఆర్ఎస్) బోధనాసుపత్రి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి వెన్నెముకను సరిచేశారు.
"సుమారు ఐదు నెలల క్రితం చికిత్స నిమిత్తం సోనావ.. ముర్షిదాబాద్ నుంచి కోల్‌కతా వచ్చింది. చిత్తరంజన్ ఆస్పత్రి నుంచి ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి పంపారు. వారు మా ఆస్పత్రికి రిఫర్ చేశారు. సాధారణంగా స్కోలియోసిస్‌తో బాధపడినవారి కంటే సోనావకు ఎక్కువగా వెన్నెముక వంగి ఉంది. అందుకే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నాం. విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. అయితే ఇలాంటి వ్యాధితో బాధపడేవారు చిన్నవయసులోనే ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. ఆపరేషన్ మరింత కష్టతరం అవుతుంది" అని ఎన్ఆర్ఎస్ ప్రొఫెసర్ కిరణ్ ముఖర్జీ చెప్పారు.


"మా అత్తగారికి ఇలాంటి సమస్యే వచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల వైద్యం అందలేదు. దీంతో ఆమె చనిపోయారు. అందుకే నా కుమార్తెకు ఈ వ్యాధి రావడం వల్ల చాలా భయపడ్డాను. అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లాను. ఎక్కడా పరిష్కారం లభించలేదు. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అది భరించలేక అక్కడ ఆపరేషన్ చేయించలేదు. చివరకు కోల్‌కతా ఎన్ఆర్ఎస్ వైద్యులు.. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు" అని సోనావ తల్లి చెప్పింది. సోనావ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. క్రమం తప్పకుండా ఆమె వ్యాయామం చేయాలని చెప్పారు. కాగా, సర్జరీ విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని సోనావ తెలిపింది.