Rare Delivery In Bengal Hospital : బాలల దినోత్సవం వేళ వైద్య రంగంలోనే ఓ అసాధారణమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు బంగాల్ వైద్యులు. తల్లి గర్భంలో ఉన్న కవల పిండాల్లో ఒకటి 18 వారాల సమయంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆరోగ్యంగా ఉన్న పిండానికి తాజాగా ప్రసవం పోశారు. 125 రోజుల పాటు తల్లి గర్భంలోనే జాగ్రత్తగా పిండాన్ని పరిరక్షించి.. ఈ నెల 14న జన్మనిచ్చారు.
41 ఏళ్ల వయసున్న ఓ మహిళ ఈ ఏడాది జూలైలో బంగాల్ బర్ధమాన్ జిల్లాలోని బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చింది. ఈ సమయంలో ఆమె కడుపులో ఇద్దరు కవలలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తు గర్భంలోని ఓ పిండం గుండె సంబంధిత సమస్యతో 18 వారాల సమయంలో కడుపులోనే మరణించింది. చనిపోయిన పిండాన్ని బయటకు తీసిన వైద్యులు.. రెండో పిండాన్ని మహిళ గర్భంలోనే కొనసాగించారు.
ప్రత్యేక వైద్య బృందం..
జాగ్రత్తలు పాటిస్తూ నెలలు నిండాక తల్లికి సురక్షితమైన డెలివరీ చేయాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. రెండో బిడ్డ ప్రసవానికి 125 రోజుల సమయం మిగిలి ఉండడం వల్ల అప్పటి వరకు ఆ పిండానికి, తల్లికి ఎటువంటి హాని జరగకుండా వైద్య పరంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. గర్భిణీని ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిలో ఉంచి పర్యవేక్షించారు.
సర్వత్రా ప్రశంసలు..
ఈ క్రమంలో ఈనెల 14న సదరు మహిళకు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. దీంతో పండంటి మగబిడ్డకు మహిళ జన్మనిచ్చింది. ఎంతో సవాళ్లతో కూడుకున్న ఈ ప్రక్రియను బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి సిబ్బంది విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో.. వారిపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.
"తల్లి వయస్సు ఒక సవాలు అనుకుంటే ఆమె IVF ద్వారా గర్భధారణకు వెళ్లింది. దీంతో పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. అందుకనే గర్భిణీని 125 రోజుల పాటు మా పర్యవేక్షణలోనే ఉండాలని కోరాం. అందుకు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అనుకున్నట్లుగానే నవంబర్ 14న ఆమెకు ప్రసవం చేశాము. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంతోషంగా ఉంది. దీంట్లో మేము గొప్ప విజయం సాధించాము."
-డాక్టర్ మలయ్ సర్కార్
'ఆమె వల్లే సాధ్యమైంది'
'4 నెలల సమయంలో మరణించిన 125 గ్రాముల పిండాన్ని ఈ జులైలో తొలగించాము. అయితే ఈ క్రమంలో మాకు ఎదురైన పెద్ద సవాల్ రెండో పిండాన్ని సురక్షితంగా కాపాడటం. ఇందుకోసం మా ప్రత్యేక వైద్య బృందం అన్నీ జాగ్రత్తలు తీసుకొని మొదటి పిండం నుంచి బొడ్డు తాడును వేరు చేసింది. ఈ సమయంలో బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాము. ఇది తల్లి 125 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండటం వల్లే సాధ్యమైంది. ఇక బాలల దినోత్సవం నాడు ఆ మాతృమూర్తి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు' అని బర్ధమాన్ వైద్య కళాశాల ఆస్పత్రి సూపరింటెండెంట్ తపస్ ఘోష్ అన్నారు.
ఆ రికార్డు బ్రేక్..
ఇలా చనిపోయిన కవల పిండాన్ని తొలగించిన తర్వాత 125 రోజులపాటు గర్భిణీ తల్లిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి రెండో శిశువుకు జన్మనివ్వండం ఓ అద్భుతమైన ఘట్టంగా అభివర్ణిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే ఇంతకుముందు 1996లో కూడా అచ్చం ఈ తరహా ఘటనే అమెరికాలోని బాల్టీమోర్ నగరంలో జరిగింది. అప్పుడు పిండాన్ని 90 రోజుల పాటు తల్లి గర్భంలోనే ఉంచి ప్రసవం చేశారని బర్ధమాన్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.