Rape in Vehicle: హరియాణా గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 16 ఏళ్ల టీనేజర్‌పై అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. కారులో బయటకు తీసుకెళ్తానని ఆ బాలికను పిలిచి.. అదే వాహనంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఫరూఖ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
రాత్రివేళ బాధిత బాలిక తన ఇంట్లో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన సంజయ్ అలియాస్ ఛోటా.. ఆమెను కిటికీలోంచి పిలిచాడు. తన కారులో రైడ్‌కు తీసుకెళ్తానని ప్రలోభ పెట్టాడు. అది నమ్మి బయటకు వెళ్లిన బాలికపై వాహనంలోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తర్వాత గ్రామంలోని పాఠశాల గేటు ముందు బాధితురాలిని దింపేసి పరారయ్యాడు.
అయితే ఆ బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తన కుమార్తె అదృశ్యమైందని ఆమె తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధిత బాలిక కోసం పోలీసులు గాలించారు. పాఠశాల గేటు వద్ద ఆమెను గుర్తించిన పోలీసులు.. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటనపై వైద్యుల నివేదిక ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: 200 మంది పౌరులతో భారత్ చేరుకున్న వైమానిక విమానం