కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(భాజపా)ని విశ్వసించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. సీఏఏ అమలు విషయంలో తమిళనాడు, బంగాల్, అసోంలో ఆ పార్టీ ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరే అందుకు ఉదాహరణ అని అన్నారు. భాజపా రాజకీయ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఈటీవీ భారత్కు బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్ విజయావకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలాంటి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు ?
ఐదు రాష్ట్రాల్లోనూ(ఓ కేంద్ర పాలిత ప్రాంతం) కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. అసోం, పుదుచ్చేరి, కేరళలో కాంగ్రెసే ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమిళనాడులో కూడా డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వం కూడా తమిళనాడు, కేరళ, అసోంలలో కాంగ్రెస్కు కలిసి వస్తుందని భావిస్తున్నాను.
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో మాత్రమే కాంగ్రెస్కు అధికారం చేపట్టే అవకాశం ఉంది. కానీ లెఫ్ట్ పార్టీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం?
ఎల్డీఎఫ్ కూటమికి సారథ్యం వహిస్తున్న సీఎం పినరయి విజయన్ తనని తాను కెప్టెన్గా చెప్పుకుంటారు. కానీ ఆయన.. చట్టాల అమలు దగ్గర నుంచి అవినీతి వరకు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డీప్ సీ ఫిషింగ్ కోసం ఓ అమెరికన్ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న రూ. 5000 కోట్ల ఒప్పందంపై తనకు ఏమీ తెలియదంటూ విజయన్ సమాధానమిచ్చారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం ఆరోపమలు ఎదుర్కొంటున్నారు. ఎల్డీఎఫ్ కూటమి, భాజపా కుమ్మకయ్యాయి. ఈ పార్టీల కారణంగా కేరళలో అభివృద్ధికి పడిన అడ్డుకట్ట తొలగించాలంటే కాంగ్రెస్- యూడీఎఫ్ కూటమి అధికారం చేపట్టడమే ఏకైక మార్గం.
అంతర్గత కలహాల కారణంగా పుదుచ్చేరిలో అధికారం కోల్పోయారు, తమిళనాడులో కేవలం 22-25 సీట్లు(కూటమిలో పంపకాలు) మాత్రమే దక్కాయి. మరి ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్కు విజయవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు?
దేశాన్ని సీబీఐ, ఆదాయపన్ను శాఖ, ఈడీ పాలిస్తే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. మేము గమనించిన విషయం ఏంటంటే ఐదేళ్ల వరకు పాలించిన ఓ పార్టీపై.. ఎన్నికలకు ఇంకా నెల ఉందనగా ఈడీ రైడ్లు జరపడం, ఆదాయపన్ను నోటీసులు ఇవ్వడం జరుగుతాయి. ఇంతలో ఆ పార్టీకి చెందిన ప్రముఖులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి పిలుపు వస్తుంది. ఆ తరువాత పరిణామాలు మారిపోతాయి.
పుదుచ్చేరిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమిత్ షా కూల్చివేశారు. కర్ణాటక, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాగే చేశారు. కాబట్టి ప్రజలు.. వీటిని గమనించి మా పార్టీ కూటములను మెజారిటీతో గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాను.
బంగాల్లో అధికారంలోకి వచ్చేందుకు భాజపా తీవ్రంగా కృషి చేస్తోంది. అసోంలో మరోసారి అధికారంలోకి వస్తే సీఏఏను ప్రవేశపెడతామని ప్రకటించింది. దీనిపై మీ స్పందన?
ఇదంతా భాజపా చేస్తున్న రాజకీయం. తమిళనాడులో సీఏఏ ప్రవేశపెట్టేది లేదని చెప్పిన పార్టీ.. బంగాల్లో అధికారం రాగానే సీఏఏ తెస్తామని చెప్పింది. అసోంలో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ దీన్ని అమలు చేయలేదు... భవిష్యత్తులో చేయదు కూడా. ఎందుకంటే అది అమలు అయితే వచ్చే పరిణామాలు ఏంటో వారికి తెలుసు. ఇలా ఒకే విషయంపై ద్వంద్వ వైఖరి వహిస్తున్న పార్టీని నమ్మొచ్చా లేదా అనే విషయం ప్రజలకే వదిలేస్తున్నాను. ఆ పార్టీ రాజకీయ అవినీతిలో కూరుకుపోయింది.
ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు?
ఎవరు గెలుస్తారనే విషయం ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల భావనలను, అభిప్రాయాలను గౌరవించకుండా గెలుపుపై భాజపా ముందుగానే నిర్ణయించుకుంటుంది. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, అసోంలలో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నాము. బంగాల్లో కూడా అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుంది.
ఇదీ చదవండి : 'బిహార్లో ప్రజాస్వామ్యం ఖూనీ'