కొవిడ్ టీకా తనకు అవసరం లేదని.. యోగా, ఆయుర్వేదం ద్వారా తనకు రక్షణ ఉందని చెబుతూ వస్తున్న యోగా గురు బాబా రాందేవ్(Baba Ramdev) మాటమార్చారు. తాను త్వరలోనే వ్యాక్సిన్(Covid vaccine) వేసుకుంటానని చెప్పారు. వైద్యులను భూమిపై దేవదూతలుగా అభివర్ణించారు. అలోపతిపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాబా.. హరిద్వార్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచిత కొవిడ్ టీకా వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను స్వాగతించారు. దీన్నో చరిత్రాత్మక చర్యగా పేర్కొన్న ఆయన.. ప్రజలంతా టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు.
"టీకా రెండు డోసులు తీసుకొండి.. యోగ, ఆయుర్వేదంతో రెట్టింపు రక్షణ పొందండి. వీటితో మీకు విస్తృత స్థాయిలో రక్షణ లభిస్తుంది. కొవిడ్‌తో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోరు"
- బాబా రాందేవ్, యోగా గురు
మంచి వైద్యులు మనకు వరమని బాబా వ్యాఖ్యానించారు. అలాగే అత్యవసర చికిత్స, సర్జరీలకు ఆలోపతి ఉ్తతమమైనదని పేర్కొన్నారు. ఐఎంఏతో ఆయన విభేదాలను ప్రస్తావించగా ఏ సంస్థతోనూ తనకు శత్రుత్వం ఉండదన్నారు. ఔషధాల పేరుతో ప్రజలను దోపిడీ చేయడాన్నే తాను వ్యతిరేకిస్తానన్నారు.
ఇదీ చూడండి: బాబా రాందేవ్‌కు హైకోర్టు నోటీసులు