Ram Setu Supreme Court : రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించి.. ఆ ప్రాంతంలో గోడ నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని చెప్పిన సుప్రీం ధర్మాసనం.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. 'గోడ నిర్మించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుంది. ఇది పాలనాపరమైన వ్యవహారం. దీన్ని మేమెందుకు చూడాలి' అని చెప్పింది. అంతేకాకుండా జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని దాఖలైన పిల్‌తో దీన్ని జత చేయాలని పిటిషనర్ కోరినప్పటికీ.. అందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
Supreme Court Order On Ram Setu : రామసేతు ప్రాంతంలో గోడ నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అశోక్ పాండే సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్ పెండింగులో ఉందని గుర్తుచేసిన ఆయన.. ఆ పిటిషన్‌తో దీన్ని కూడా జతచేయాలని కోరగా.. కోర్టు నిరాకరించింది.
'జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రటించాలి'
అంతకుముందు రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి గతంలోనే సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. స్మారక చిహ్నమా? కాదా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్ల తరబడి నాన్చుతోందని తన పిటిషన్లో పేర్కొన్నారు. గతేడాది నవంబరులో దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అడమ్స్ బ్రిడ్జ్‌గా పిలిచే ఈ రామసేతుకు సంబంధించి అనేక అంశాలపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది.