Muslim Youth Free Ram Tattoo : ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. త్వరలో ఆయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో భక్తులకు శ్రీరామ నామాన్ని ఉచితంగా పచ్చబొట్టు వేస్తున్నట్లు తెలిపాడు. ఇలా 51 వేల మందికి ఉచితంగా టాటూలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 'ఈటీవీ భారత్'తో చెప్పాడు.
జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమకు వీలైనంతలో ఏదో ఒకటి సమర్పించుకుంటున్నారు. తాను కూడా ఏదో ఒకటి చేయాలని కాన్పుర్‌లో నివాసం ఉండే టాటూ ఆర్టిస్ట్ అహ్మద్ ఫరాజ్‌కు ఓ ఆలోచన వచ్చింది. భక్తులకు శ్రీరామ నామాన్ని ఉచితంగా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక తనకు వీలైనంతలో 51 వేల మంది భక్తులకు ఉచితంగా శ్రీరామ నామం పచ్చబొట్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
జనవరి 9 నుంచి ఉచితంగా టాటూలు వేయడం మొదలు పెట్టాడు ఫరాజ్. ఇప్పటివరకు ఫరాజ్ వద్ద వందలాది మంది శ్రీరామ నామాన్ని పచ్చబొట్టు వేయించుకున్నారు. ఉచిత టాటూ కోసం ఇంకా 500 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే పచ్చబొట్టు వేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పిన ఫరాజ్ అహ్మద్, తన లక్ష్యం పూర్తి కావాలంటే మరికొంత మంది సాయం కావాలని అన్నాడు. అందుకే తన బృందంలో మరో ఇద్దరిని చేర్చుకున్నట్లు తెలిపాడు.
"నేను పాటించే ధర్మం, అది నా సొంతం. దానర్థం నేను ఇతర మతాలను గౌరవించనని కాదు. ఇస్లాం, ప్రజలందరినీ ప్రేమించమని బోధిస్తోంది. భక్తులు శ్రీరాముడి నామాన్ని పచ్చబొట్టు వేయించుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారు. మేము కూడా సంతోషంగా టాటూలు వేస్తున్నాం" అని చెప్పాడు టాటూ ఆర్టిస్ట్ ఫరాజ్ అహ్మద్.
రూ.7 కోట్లు ఖర్చు!
'చాలా మంది తమ చేతులపై 'జైశ్రీరామ్' అని పచ్చ బొట్టు వేయించుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఒక్క పచ్చబొట్టు వేయడానికి దాదాపు రూ.1400 ఖర్చు అవుతుంది. కానీ మేము శ్రీరాముడి కోసం డబ్బులు తీసుకోవడం లేదు. మొత్తం 51 వేల టాటూలు వేయడానికి రూ.7 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఉచితంగా టాటూ వేస్తున్నాం గనుక, నాణ్యతలో రాజీ పడుతున్నామని ప్రజలు అనుకోవద్దు. పచ్చబొట్లకు బ్రాండెడ్, దిగుమతి చేసుకున్న ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నాం' అని ఫరాజ్ అహ్మద్ వివరించాడు.
అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు- ఎక్కడో తెలుసా?
రాముడి కోసం సైకిళ్లపై 'అయోధ్య యాత్ర'- 25 రోజుల్లో 1600 కి.మీ ప్రయాణం!