పార్లమెంటరీ కమిటీల్లో 50 కంటే అధిక హాజరు శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మేరకు ఎనిమిది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లు, సభ్యులకు ఆయన లేఖ రాశారు. పని చేసే సమయం గతంలో కంటే మెరుగైనందుకు అభినందించారు.
రెండున్నర గంటలపాటే సమావేశం నిర్వహించాలని కాకుండా.. వీలైనంత ఎక్కువ సేపు కమిటీ సమావేశాలు కొనసాగించాలని తెలిపారు. 2017 సెప్టెంబర్ తర్వాత కమిటీల కార్యకలాపాల వివరాలను తెలియజేస్తూ వెంకయ్యనాయుడు లేఖను పంపారు.
కమిటీల పని తీరు ఇలా..
- విద్య, శిశు, మహిళ, యువత, క్రీడలపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ.. 65.3 శాతం సగటు హాజరును నమోదు చేసింది.
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్టాండింగ్ కమిటీ.. 52.46 శాతం
- రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీ.. 50.42 శాతం
- 2017 సెప్టెంబర్ నుంచి రాజ్యసభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు 355 సమావేశాలను నిర్వహించింది.
- 2017-18లో 134 సమావేశాలు
- 2018-19లో 49 సమావేశాలు
- 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు- 172 సమావేశాలు
ఏటా సెప్టెంబర్లో ఈ కమిటీలను పునర్ వ్యవస్థీకరిస్తారు. ప్రతి కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభ నుంచి 10 మంది, లోక్సభ నుంచి 21 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పదకొండు మంది హాజరైతే కోరంగా పరిగణిస్తారు.
- 2019 సెప్టెంబర్ నుంచి నిర్వహించిన 172 సమావేశాల్లో 8 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు.. 49.34 హాజరు శాతాన్ని నమోదు చేశాయి. 2017-19 మధ్య నిర్వహించిన సమావేశాలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2017-19లో 42.9 సగటు హాజరు నమోదైంది.
- 2017-19 మధ్య ఏ కమిటీ కూడా 50 శాతం హాజరును సాధించలేదు.
- 2019 సెప్టెంబర్ అనంతరం.. మూడు కమిటీలు 50 శాతం కంటే ఎక్కువ హాజరు శాతాన్ని నమెదు చేశాయి.
- 2019 సెప్టెంబర్లో ఏర్పాటైన అనంతరం నుంచి సగటు సమావేశాల వ్యవధి 2 గంటల ఏడు నిమిషాలు పెరిగింది. 2017-19 పోలిస్తే ఇది 16 శాతం అధికం.
ఈ కమిటీల పనితీరు.. పార్లమెంట్ ఏడాది మొత్తం పని చేస్తోందనడానికి సాక్ష్యాలు అని వెంకయ్యనాయుడు తన లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాజకీయ సంక్షోభం వేళ పుదుచ్చేరికి రాహుల్