తాను రాజకీయాల్లోకి రావట్లేదని మరోసారి స్పష్టం చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. అలాగే రజనీ మక్కళ్ మండ్రం(ఆర్ఎంఎం)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎంఎం నిర్వాహకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ సమావేశమయ్యారు. అనంతరం పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.
రజనీ అభిమాన సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి.. సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తలైవా వెల్లడించారు. రజనీ మక్కళ్ మండ్రం సభ్యులూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
"సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చాను. సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా గత కొంతకాలం నుంచి మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను. ఈ క్రమంలోనే నేడు నిర్వాహకులందరితో సమావేశమయ్యాను. వాళ్లందరికీ నా రాజకీయ అరంగేట్రంపై ఎన్నో సందేహాలున్నాయి. భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని వాళ్లు నన్ను అడుగుతున్నారు" అని రజనీ తెలిపారు.
రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతారంటూ ఎంతో కాలంగా కొనసాగిన చర్చలకు గతేడాది డిసెంబర్‌లో ఆయన చెక్‌పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన విరమించుకుంటున్నట్టు స్పష్టం చేశారు.