Rajasthan Election 2023 Counting : రాజస్థాన్‌లో ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 200 శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ కరణ్‌పుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మిత్‌సింగ్ హఠాన్మరణం చెందటం వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. గతనెల 25న ఓటింగ్ జరిగిన మిగతా 199 స్థానాలకు ఆదివారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు.
4.36 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నట్లు రాజస్థాన్ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. రాజస్థాన్‌లో మొత్తం 33 జిల్లాలు ఉండగా జయపుర, జోథ్‌పుర్, నాగౌర్‌లో 2 చొప్పున, మిగతా జిల్లాల్లో ఒకటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51,896 పోలింగ్ కేంద్రాల్లోని EVMల కోసం 2,514 టేబుళ్లను ఏర్పాటు చేశారు. షియో నియోజకవర్గానికి సంబంధించి 41రౌండ్లు, దక్షిణ అజ్మేర్లో 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ఫలితాలను సకాలంలో ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాజస్థాన్ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
గెలుపుపై కాంగ్రెస్ ధీమా!
రాజస్థాన్‌లో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను విజయతీరాలకు చేరుస్తాయని ఆ పార్టీనేతలు అంటున్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ వంద స్థానాల్లో, బీజేపీ 73 సీట్లు గెలుపొందాయి. మ్యాజిక్ మార్క్‌కు ఒక్క స్థానం తగ్గినా బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గహ్లోత్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి తమదే అధికారమని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ ఛరిష్మా, అధికారం మారే సంప్రదాయం తమకు అనుకూలించే అంశాలని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు రాజస్థాన్ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఓటింగ్ కేంద్రం వద్దకు ఇతరులు ఎవరూ రాకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 40కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలు, 36 కంపెనీల రాజస్థాన్ ఆర్మ్‌డ్ పోలీసులను మోహరించారు.
మోదీ Vs గహ్లోత్?.. ఈ 5 అంశాలు ఎవరికి కలిసొస్తే వారిదే పీఠం!
ఎవరీ 'దియ'?.. వసుంధరకు ప్రత్యామ్నాయం కాగలరా? రాజస్థాన్‌లో బీజేపీ మాస్టర్ ప్లాన్!