Rajamahendravaram Central Jail: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న నేపథ్యంలో ఆ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా నెలవుపై వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్లటం, ఆ స్థానంలో జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ బాధ్యతలు చేపట్టటం వంటి అనూహ్య పరిణామాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ... చంద్రబాబుతో ములాఖత్ అయి బయటకు వచ్చిన గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తన భార్యకు అనారోగ్యం వల్లే సెలవుపై వెళ్తున్నానని జైలు సూపరింటెండెంట్ (Rajahmundry Central Prison Superintendent Leave) రాహుల్ చెబుతున్నప్పటికీ, అసలు కారణం వేరేది ఉందని, ఆయనపై కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి సెలవుపై పంపించేశారనే వాదనలు ఉన్నాయి. కారాగారంలో ఉన్న చంద్రబాబు భద్రతపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే చంద్రబాబు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టులు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు, తీవ్రమైన హింసాత్మక నేరాలకు పాల్పడినవారు, రౌడీషీటర్లు, కరుడుగట్టిన నేరగాళ్లు, ఆయుధాలు వినియోగించటంలో ఆరితేరిన వారున్న రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబును సరైన భద్రత లేకుండా ఉంచటంపైన ఆందోళన ఉంది. ఇలాంటి నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి తర్వాత చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు (Rajamahendravaram Central Jail) తరలించారు. ఆ మరుసటి రోజే జైలు సూపరింటెండెంట్ బదిలీ అయ్యారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. తాజాగా సెలవుపై వెళ్లిపోయారు. చంద్రబాబును జైలుకు తీసుకొచ్చిన సమయంలో పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాలిటీలు పాటించనీయకుండా.. చిన్నపాటి సడలింపులు ఇచ్చారనే వాదన ఉంది. చంద్రబాబు నాయుడు ములాఖత్‌ల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించలేదని, జైలులో ఆయనతో కొంత సన్నిహితంగా ఉంటున్నారని, ఎక్కువ సార్లు మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారనే కారణంతోనే ఆయనను బలవంతంగా సెలవుపై పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతేడాది రిమాండులో ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణపై అప్పటి సూపరింటెండెంట్ ఎస్. రాజారావును నెల్లూరు కేంద్ర కారాగారాల శిక్షణ కార్యాలయానికి ఆకస్మాత్తుగా బదిలీ చేశారు. రాజారావు స్థానంలో అదే శిక్షణ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్.కిషోర్ కుమార్‌ను నియమించారు. జైలు నిబంధనలు ఉల్లంఘించలేదని విచారణలో తేలడంతో ఉమ జైలు నుంచి విడుదలయ్యాక నెలన్నర తరువాత రాజారావుకు మళ్లీ రాజమహేంద్రవరం కారాగార పర్యవేక్షక బాధ్యతలు అప్పగించారు.
ఈ ఏడాది మే నెలలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్నారు. వారిని చంద్రబాబు ములాఖత్లో కలిశారు. జైలులో వారికి సదుపాయాలు కల్పిస్తున్నారని కొందరు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో సూపరింటెండెంట్ రాజారావును మరోసారి నెల్లూరు శిక్షణ కార్యాలయానికి ఆకస్మికంగా బదిలీ చేసి, విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఉన్న ఎస్. రాహుల్‌ను నియమించారు. ప్రస్తుతం రాహుల్ సెలువుపై వెళ్లిపోయారు.
సెలవు నిర్ణయంపై సూపరింటెండెంట్ రాహుల్‌ను వివరణ కోరగా నాలుగు రోజులుగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, గురువారం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే సెలవు పెట్టినట్లు తెలిపారు. టీడీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వచ్చిన ప్రతీ సారి జైలులో ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బందికి విధులు నిర్వర్తించడం కత్తిమీద సాములా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది.