Rahul Hindutvawadi: హిందుత్వవాది గంగానదిలో ఒంటరిగా స్నానం చేస్తాడని, హిందువు.. కోట్లమందితో కలిసి స్నానం చేస్తాడన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ క్రమంలో హిందూ, హిందుత్వవాది మధ్య తేడా ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
" హిందూ వర్సెస్ హిందుత్వవాది.. హిందూ అంటే నిజం, ప్రేమ, అహింస. హిందుత్వవాది అంటే తప్పు, విద్వేషాలు, హింస. హిందుత్వవాది ఒంటరిగా గంగానదిలో స్నానం చేస్తాడు. కానీ హిందువు కోట్లమందితో కలిసి స్నానం చేస్తాడు. ప్రధాని మోదీ తాను.. హిందుత్వవాదిగా చెప్పుకుంటారు. కానీ ఆయన ఎప్పుడైనా నిజాన్ని కాపాడారా? మరి ఆయన హిందువా? లేక హిందుత్వవాదా?"
-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
ప్రధాని మోదీ నిర్ణయాలవల్లే..
Rahul Gandhi On Modi: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాహుల్ ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దేశంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. వీటిపై ప్రధాని కానీ రాష్ట్ర సీఎం కానీ నోరు విప్పడంలేదని మండిపడ్డారు.
" ప్రధాని మోదీ రైతు చట్టాలను తీసుకొచ్చారు. రైతులు ఈ చట్టాలను వ్యతిరేకించారు. సంవత్సరం తర్వాత మోదీ.. రైతులకు క్షమాపణలు చెప్పారు. రైతుపోరాటంలో మృతిచెందినవారికి పరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. దానిపై ఎలాంటి స్పందన లేదు. నేను 2004లో రాజకీయాల్లోకి వచ్చాను. నేను తొలిసారి అమేఠీనుంచే పోటీ చేశాను. అమేఠీ ప్రజలు నాకు రాజకీయాలు నేర్పించారు."
-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
అమేఠీ నియోజకవర్గం నా కుటుంబం లాంటిదన్నారు రాహుల్. ఈ బంధం చిరకాలం ఉంటుందన్నారు.
కొవిడ్ బాధితులను ఆదుకుంటాం..
Priyanka Gandhi On Modi: అమేఠీలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా సైతం పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే.. రైతుల రుణమాఫీ చేస్తామని, విద్యుత్ బిల్లులను తగ్గిస్తామన్నారు. 20లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, కొవిడ్-19తో ఇబ్బందులు పడ్డ కుటుంబాలకు రూ. 25వేలు ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: Modi UP: 'గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో యువతకు అపార ఉపాధి అవకాశాలు'