కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన కానుకతో ఓ బాలుడు ఆనందంలో మునిగిపోతున్నాడు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ బాలుడితో మాట్లాడిన రాహుల్.. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని.. అతడికి రన్నింగ్ షూస్‌ను అందించారు.
ఈ నెల 1న తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్. ఈ పర్యటన సందర్భంగా అక్కడి వెదురు తోటల్లో ఉన్న కొందరు బాలురు పలకరించగా.. రాహుల్ గాంధీ కారులో నుంచి దిగి వారితో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆంథోనీ ఫెలిక్స్ అనే ఆరో తరగతి బాలుడు తనకు పరుగు పందెం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తెలిపాడు. అలాగే సరైన శిక్షణ ఇప్పిస్తే.. పోటీల్లో గెలవగలనని విశ్వాసంతో చెప్పాడు. బాలుడి మాటలు విన్న రాహుల్ గాంధీ కోచ్‌ను ఏర్పాటు చేస్తానని.. రన్నింగ్ షూస్ సైతం కొనిస్తానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం మేరకు ఆంథోనికి బూట్ల జత కొని పంపారు.
ఇవి అందుకున్న బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆంథోనితో ఫోన్లో మాట్లాడిన రాహుల్.. 'బూట్లు నచ్చాయా' అని అడిగారు.
ఇదీ చదవండి: కథ సుఖాంతం.. కన్నతల్లి చెంతకు గీత