దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న లక్షద్వీప్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. పర్యావరణ పవిత్రతను, భూ యాజమాన్య రక్షణను లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ అణగదొక్కుతోందని ఆయన ఆరోపించారు. ప్రజల భవిష్యత్తుకు ముప్పు కలిగించేలా అక్కడి అడ్మినిస్ట్రేటర్ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
భారత ప్రధాన భూభాగానికి దూరంగా, అరేబియా సముద్రంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతమైన 'లక్ష ద్వీప్'లో రాజకీయ కార్యకలాపాలు చాలా తక్కువ. ప్రముఖ పర్యటక ప్రాంతంగానే దీనికి గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ 'సేవ్ లక్ష ద్వీప్' అంటూ ఏకంగా ఉద్యమమే సాగుతోంది. ఇందుకు ఇతర ప్రాంతాల్లోనూ మద్దతు లభిస్తోంది. 'లక్షదీప్‌కు కొత్త రూపం' పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కె పటేల్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే దీనికంతటికీ కారణం.
'లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యాపార లాభాల కోసం ప్రజల జీవనోపాధిని, భద్రతను పణంగా పెడుతున్నారు. ప్రశాంతంగా ఉండే ద్వీపంలో శాంతిభద్రతల పేరుతో కఠిన నిబందనలు విధించే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు.' అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.
'ఇంతవరకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్య, పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉండగా, వాటిని అడ్మినిస్ట్రేటర్ పరిపాలన కిందకు తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య చాలా తక్కువ. అయినా గూండా చట్టాన్ని అమలు చేశారు. ఇక్కడ మద్య నిషేధం అమల్లో ఉంది. పర్యటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. కేరళలోని బైపుర్ నౌకాశ్రయం నుంచి అక్కడికి సరకులు రవాణా అవుతుంటాయి. అయితే కర్ణాటకలోని మంగుళూరు రేవు నుంచి తెచ్చుకోవాలని ఆదేశించడం వెనుక మర్మమేంటి?' అని రాహుల్ ప్రశ్నించారు.
ప్రధాని మోదీ వెంటనే స్పందించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరారు. లక్షద్వీప్ ప్రజల జీవన విధానాన్ని గౌరవించాలన్నారు. పర్యటక రంగం అభివృద్ధి పేరుతో నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ప్రాంత యువత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రారంభించిన 'సేవ్ లక్షదీప్' ఉద్యమానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ ప్రకటించారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌ను వెంటనే వెనక్కి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Rahul gandhi: నెహ్రూ వర్ధంతి- రాహుల్ నివాళులు