Rahul Gandhi Security: దిల్లీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయంలో అనేక వైఫల్యాలు కనిపించాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. దిల్లీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా భద్రతా మార్గదర్శకాలను పూర్తిగా పాటించామని.. కానీ, రాహుల్ గాంధీ పదేపదే వాటిని ఉల్లంఘించారని పేర్కొన్నాయి. రాహుల్ గాంధీ 2020 నుంచి 113 సార్లు సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినట్లు తెలిపాయి. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించాయి.
దిల్లీలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చుట్టూ జనాలను నియంత్రించడంలో, భద్రతా వలయాన్ని నిర్వహించడంలో దిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది. జడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిన వ్యక్తికి.. దిల్లీ పోలీసులు కనీస రక్షణను ఇవ్వలేకపోయారని విమర్శించింది. పంజాబ్, జమ్మూ- కశ్మీర్ వంటి సున్నిత ప్రాంతాల గుండా యాత్ర సాగే క్రమంలో రాహుల్‌కు భద్రతను పెంచాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని దిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీల సమన్వయంతో సీఆర్‌పీఎఫ్ ఈ యాత్రకు భద్రత కల్పిస్తోంది